తెలంగాణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌

Congress on Telangana High command focus– గెలిచి తీరాలంటూ ప్రణాళికలు
–  ప్రతి సమావేశంలోనూ దిశానిర్దేశం
–  క్షేత్రస్థాయి పర్యవేక్షణలోనూ కీలకం
–  ఎప్పటికప్పుడు ఏఐసీసీకి నివేదికలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్‌ అధిష్టానం కేంద్రీకరించింది. కర్నాటక తర్వాత రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో పనిచేస్తోంది. గతంలోలాగా అంతా రాష్ట్ర నాయకత్వంపై వదిలేయకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నది. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అధిష్టానం కన్నుసన్నల్లోనే కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి గత రెండు నెలల్లో ఢిల్లీ నుంచి 30 మంది దూతలు వచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, మన్సుర్‌అలీ ఖాన్‌, ప.ి విశ్వనాథ్‌…ఇక్కడే మకాం వేశారు. గాంధీభవన్‌ నుంచి ఠాక్రే పర్యవేక్షణ చేస్తుండగా, మిగతా ముగ్గురు మాత్రం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లో నిర్మాణం, పార్టీ బలోపేతం, అంతర్గత విభేదాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. పార్టీ దృష్టికి వస్తున్న సమస్యలను హైకమాండ్‌కు నివేదిస్తున్నారు. రాష్ట్రంలోని 17పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక ఇంచార్జితోపాటు వారందరికీ కన్వీనర్‌గా దీపదాస్‌ మున్షీని, కో కన్వీనర్‌గా మీనాక్షి నటరాజన్‌ను పార్టీ నియమించింది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ దాన్ని పరిష్కరిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దూకుడు…దూకుడే
ఎన్నికలు ముంచుకొస్తున్న కొద్ది కాంగ్రెస్‌ మరింత దూకుడు పెంచుతోంది. ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుపోయేందుకు కార్యాచరణ రూపొందించింది. కర్నాటక ఎన్నికల తరహాలోనే టీపీసీసీకి మార్గనిర్దేశం చేసేందుకు అధిష్టానం ఇక్కడే తిష్ట వేసింది. ప్రతి సమావేశంలోనూ పాల్గొని అగ్రనేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. అభిప్రాయ భేదాలు బహిర్గతం కాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలపై అధిష్టానం నిఘా పెట్టారు. పార్టీలో కోవర్టులను సైతం తోవకు తెచ్చినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీని అంతర్గతంగా బలోపేతం చేస్తూనే…క్రియశీలక నాయకులను గుర్తించి వారిని అనేక కమిటీల్లో నియమిన్నారు. అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికైతే టికెట్‌ రాదో వారిని బుజ్జగిస్తున్నారు. ఈ విధంగా నాయకుల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ…ఎక్కడిక్కడే సర్దుబాటు చేస్తున్నారు.
17న ఎన్నికల శంఖారావం
మరోవైపు సీడబ్ల్యుసీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్‌…దాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈనెల 17న నిర్వహించబోయే విజయభేరి సభను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి ఊపు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు. సభకు భారీ జనసమీకరణ చేపట్టడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి ఇక తిరుగులేదనే సంకేతాలు ఇచ్చేందుకు నాయకత్వం ప్రయత్నిస్తున్నది. మరోవైపు మ్యానిఫెస్టో కమిటీ, కమ్యూనికేషన్‌ కమిటీ, శిక్షణ తరగతుల కమిటీ, బీసీ డిక్లరేషన్‌ కమిటీ…ఇలా రకరకాల కమిటీ సమావేశాలతో గాంధీభవన్‌ బిజీబిజీగా మారింది. మ్యానిఫెస్టో కమిటీ కీలకంగా మారబోతున్నది. విజయభేరి సభలో సోనియాగాంధీ ఇచ్చే ఐదు హామీలపై సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. అందులో మహిళా, రైతు, యువత, సంక్షేమం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ), అసైన్డ్‌ భూములపై కీలక హామీలు ఉండనున్నాయి. కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే అమలు చేస్తున్న కాంగ్రెస్‌…ఇక్కడ కూడా అదే మాదిరిగా హామీలిచ్చి అమలయ్యేలా రాహుల్‌గాంధీ భరోసా కల్పించనున్నారు.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, అభ్యర్థుల ఎంపికలోనూ ఆచీతూచీ వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. కర్నాటకలో ఓ నియోజకవర్గం నుంచి సిద్దారామయ్య గెలిచే అవకాశం లేదంటూ అధిష్టానం ఆయన్ను వేరే నియోజకవర్గానికి మార్చింది. అదే తరహాలో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అధిష్టానం చేపట్టిన సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేల్లో ఫలానా నేత అక్కడ ఓడిపోతారనే సంకేతాలు ఉంటే, ఆయన స్థానంలో మరో అభ్యర్థిని ఖరారు చేసేలా అధిష్టానం ప్లాన్‌ బీ రెడీ చేసింది.

Spread the love