నవతెలంగాణ – న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది సీఎం పదవిని ఆశిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు. పా పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ, జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్‌రావు థాక్రే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కొత్త సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్నారు. సీఎం పదవి కోసం రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రామార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. దాంతో సోమవారం రాత్రి 8 గంటలకే జరుగుతుందనుకున్న సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఆగిపోయింది. ముగ్గురిలో ఒకరి పేరును ఖరారు చేయడం కోసం హైకమాండ్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో విడివిడిగా సమావేశమైన డీకే.. ఇప్పుడు ఖర్గేతో భేటీయై నివేదికను సమర్పించారు. రేవంత్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్న హైకమాండ్ ఈ సమావేశంలో చర్చ అనంతరం ఆయననే సీఎంగా ప్రకటించే అవకాశం ఉంది.