– టీఓఏలో జితేందర్ రెడ్డి వర్సెస్ మహేశ్ కుమార్
– సీఎం రేవంత్ రెడ్డి జోక్యం అనివార్యం
తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ)లో కాంగ్రెస్ కుమ్ములాటలు క్రీడాకారులను విస్తుగోల్పుతుంది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ టీఓఏలో ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు ఒలింపిక్ సంఘంలో వర్గపోరుకు తెరతీయటంతో ఎటు వైపు నిలవాలనే సంశయంలో క్రీడా సంఘాలు ఉన్నాయి.
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) రాజకీయం రక్తి కడుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ జితేందర్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్లుగా జితేందర్ రెడ్డి ప్యానల్ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నుంచి టీఓఏ నూతన కార్యవర్గానికి ఇంకా గుర్తింపు దక్కలేదు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్, ఎలక్ట్రోరల్ కాలేజ్‌లో అవకతవకలు, సహా ఎన్నికలకు ఐఓఏ పరిశీలకులు లేకపోవటం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. 38వ జాతీయ క్రీడలకు చెఫ్ డి మిషన్‌ను నియమించే అధికారం చేతుల్లోకి తీసుకున్న ఐఓఏ.. టీఓఏకు గట్టి షాక్ ఇచ్చింది. జాతీయ క్రీడలకు రాష్ట్ర జట్లను సైతం పంపే అధికారం కోల్పోయిన టీఓఏ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుంది. ఈ పరిస్థితి ఒలింపిక్ సంఘంలో కాంగ్రెస్ కుమ్ములాటలే కారణమని విమర్శలు వస్తున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఒలింపిక్ సంఘం వేదికగా ఆధిపత్య పోరుకు తెరతీయటం ప్రభుత్వ, పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. జాతీయ క్రీడలకు జట్లను పంపాల్సిన ఐఓఏ నియమిత చెఫ్ డి మిషన్ అధికారులు ఓ వైపు, టీఓఏ ఆఫీస్ బేరర్లు ఓ వైపు పోటాపోటీ సమావేశాలు నిర్వహించటంతో క్రీడాకారులు, క్రీడా సంఘాలు గందరగోళానికి గురవుతున్నాయి.
సీఎం రేవంత్ జోక్యం అనివార్యం
క్రీడా మంత్రిత్వ శాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి క్రీడా ఈవెంట్‌కు సీఎం హాజరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో క్రీడలకు భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్రంలో క్రీడా రంగం ప్రగతి పథాన సాగుతుందనే ఆశ క్రీడాకారుల్లో చిగురించింది. ఇదే సమయంలో తెలంగాణ ఒలింపిక్ సంఘం వేదికగా వర్గ రాజకీయం క్రీడాకారులను గందరగోళంలోకి నెట్టివేసింది. ముఖ్యమంత్రి తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలి. సీఎం జోక్యం చేసుకుని తెలంగాణ ఒలింపిక్ సంఘాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, రాష్ట్రంలో క్రీడా రంగం మళ్లీ తిరోగమనంలో పడిపోయే ప్రమాదం ఉంది.