– బీడీ కార్మికులకు 25 పని దినాలు కల్పిస్తాం : కామారెడ్డిలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్/ఇంద్రవెల్లి
‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య ఈ ప్రాంతానికి చెందిన వాడే. కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంత్ చారి, యాదయ్య సహా అనేక మంది విద్యార్థులు ప్రాణం కోల్పోతున్న నేపథ్యంలో సోనియాగాంధీ స్పందించి.. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందన్న విషయం తెలిసి కూడా తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది.. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తే.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టే’ అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో శనివారం జోడో పాదయాత్ర కొనసాగింది. ఉదయం సారంపల్లి నుంచి చిన్న మల్లారెడ్డి, కొట్టాలపల్లి రోడ్డు మీదుగా రాజంపేటకు చేరుకుంది. సాయంత్రం క్లాసిక్ గార్డెన్ రోడ్డు నుంచి కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వరకు రేవంత్‌రెడ్డి పాదయాత్ర కొనసాగింది. వర్షాన్ని లెక్కచేయకుండా నడిచారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహి తుడని, ఇప్పుడు తనకు కూడా సన్నిహితుడే అని చెప్పారు. నియోజకవర్గంలో షబ్బీర్ బారుని 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి 22 ప్యాకేజీ పనులు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ, ఇల్లు లేని నిరుపేదల కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గంప గోవర్ధన్‌పై చార్జ్‌షీట్ విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా మల్లారెడ్డి గ్రామంలో రేవంత్ రెడ్డి బీడీ కార్మికులను కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంలో బీడీలను నిషేధిస్తామని మోడీ బిల్లు తీసుకొస్తే.. బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడి ఆపిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీడీ కార్మికులకు 25 రోజుల పని దినాలు కల్పిస్తామని, పెన్షన్లు ఇస్తామని బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు.
ఇంద్రవెల్లికి చేరుకున్న భట్టి యాత్ర సంఘీభావం తెలిపిన ప్రజాగాయకుడు గద్దర్
ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుంచి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర శనివారం ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలానికి చేరుకుంది. సిరికొండ మండలం కొండాపూర్ నుంచి ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్, కేస్లాపూర్, ముత్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రం వరకు కొనసా గింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాదయాత్రకు మహిళలు మంగళ హారతు లతో స్వాగతం పలికారు. 20 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. యాత్రలో సీఎల్పీ నేత దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పార్ల మెంటులో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.