– డిసెంబర్ 9న ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– బీఆర్‌ఎస్‌ను ప్రజలు బొంద పెట్టాలి
– టీడీపీ శ్రేణులు కలిసి రావాలి
– అక్రమ కేసులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడేది లేదు: రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకొని దాచుకుంటుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తెలిపారు. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తింద న్నారు. ఇక మూడవసారి కూడా కేసీఆర్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అమ్ముకొని కొల్లగొడతాడని స్పష్టం చేశారు. నవంబర్ 30న జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా సభా వేదికపై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమాండ్ల యశస్విని రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నిండిన పాలకుర్తి ప్రజలను చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోందని అన్నారు. 1200 మంది ఆత్మబలి దానాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు రాచరిక పాలనను కొనసాగిస్తూ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్రమ కేసులను కొట్టివేయిస్తామని భరోసా ఇచ్చారు.
దయాకర్‌రెడ్డి తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో డీలర్ నుంచి డాలర్లకు ఎదిగారని, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను పూర్తి చేయకుండానే రూ.250 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నమ్మక ద్రోహి, మిత్ర ద్రోహి అని దయాకర్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. శుత్రువులతో చేతులు కలిపి, కుట్రలు చేసి తనను జైలుకు పంపించాడని, దయాకర్‌రావు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పాలకుర్తి గడ్డపై ఈ సారి ఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనను అంతమొందించేందుకు టీడీపీ శ్రేణులు కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపు నిచ్చారు. పేదలకు న్యాయం జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా.. కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు.ఝాన్సీ రెడ్డికి భారతదేశ పౌరసత్వం రాకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డుకున్నారని, ప్రజల అండను, నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఝాన్సీ రెడ్డి తన కోడలు యశస్విని రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చారని తెలిపారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుందని నిరూపిస్తే నాతోపాటు యశస్విని రెడ్డి నామినేషన్‌లను ఉపసంహరించు కుంటామని, నిరూపించక పోతే సీఎం కేసీఆర్.. ప్రొఫెసర్ జయశంకర్ సాక్షిగా హన్మకొండలో ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీ రెడ్డి, నియోజకవర్గ నాయకులు శోభారాణి, సోమేశ్వరరావు, కాకిరాల హరిప్రసాద్, రాపాక సత్యనారాయణ, నిరంజన్ రెడ్డి, కుమారస్వామి గౌడ్, అనుముల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ తుది జాబితా విడుదల – పఠాన్‌చెరు అభ్యర్థి మార్ఫు
ఎట్టకేలకు కాంగ్రెస్ తుది జాబితాను గురువారం రాత్రి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. పఠాన్‌చెరు నియోజక వర్గ అభ్యర్థిగా గతంలో ప్రకటించిన నీలం మధను పక్కన బెట్టి ఆయన స్థానంలో కట్టా శ్రీనివాస్‌గౌడ్‌కు టికేట్ కేటాయించారు. చార్మినార్‌కు మహ్మద్ ముజీబుల్లా షరీఫ్, మిర్యాలగూడకు బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేటకు రామిరెడ్డి దామోదర ్‌రెడ్డి, తుంగతుర్తికి ఎస్సీ మందుల సునిల్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు. నామినేషన్లకు శుక్రవారం చివరి కావటంతో ఆయా నియోజక వర్గాలలో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచిన అభ్యర్థులు తుది జాబితాకై ఉత్కంఠగా ఎదురు చూశారు. కాంగ్రెస్ అధిష్టానం తుది జాబితా ప్రకటించటంతో ఆ ఉత్కంఠతకు తెరపడినట్టయింది.