కేకే ఇంటికి కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ

Congress party in charge of KK house– దీపాదాస్‌ మున్షీతో మాటామంతి
– కేశవరావు పార్టీ మారతారని ప్రచారం?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావును కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి ఆమెతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షులు రోహిన్‌రెడ్డి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన రాజకీయ చర్చల్లో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతున్న సమయంలో కేకేను కాంగ్రెస్‌ నేతలు కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కేకేతో పాటు ఆయన కూతురు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరికలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హస్తం పార్టీలో చేరి లోక్‌సభ టికెట్లు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కేకే, మేయర్‌ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు సాగించటం గమనార్హం. మరో వైపు.. తాను పార్టీ మారడం లేదని కేకే స్పష్టం చేశారు.

Spread the love