రాజస్థాన్‌లో కులగణన చేపడతాం.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ

నవతెలంగాణ – జైపూర్‌: తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే .. రాజస్థాన్‌లో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మంగళవారం  ఎన్నికల మేనిఫెస్టోను  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా   మాట్లాడుతూ.. పేపర్‌ లీక్‌ మప్పును ఎదుర్కొనేందుకు కొత్త చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. మహిళలు, అణగారిన వర్గాల సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తామని అన్నారు. జైపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌లు కూడా పాల్గొన్నారు. పంచాయితీ స్థాయిలో ఉద్యోగాల కోసం కొత్త ఉపాధి పథకం, ఉజ్వల పథకం కింద లబ్థిదారులకు రూ. 400 వంటగ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చిరంజీవి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ లబ్థిదారులకు ఇచ్చే మొత్తాన్ని రూ. 25 లక్షల నుండి రూ. 50 లక్షలకు పెంచుతామని అన్నారు. వచ్చే ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానంపై చట్టం, ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ప్రకృతి  విపత్తుల్లో  ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రూ.15లక్షల వరకు బీమా పథకాన్ని ప్రకటించాయి. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Spread the love