– సిట్టింగులందరికీ సీట్లివ్వకుండా ఓటమిని అంగీకరించారు…
– మోసపోయిన వారంతా తిరగబడండి
– కమ్యూనిస్టులు అధికారం కోసం పాకులాడే వారు కాదు.. ప్రజల కోసం పోరాడే వారు
– వారినీ మోసం చేశారు : పీసీసీ చీఫ్ రేవంత్
– తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎంకు సవాల్
– అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం కేసీఆర్ చేతిలో మోసపోయిన వారంతా తిరగబడాలని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సిట్టింగులందరికి సీట్లిస్తాననీ పలుమార్లు ప్రకటించిన ఆయన… మాట తప్పి వారిని మోసం చేశారని తెలిపారు. మునుగోడు ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులను హౌ…ఓహౌ అన్న కేసీఆర్ వారిని కూడా మోసం చేశారని వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లిని నిలబెట్టి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి పారిపోయి కామారెడ్డిలో పోటీ చేస్తానంటున్న కేసీఆర్ మైనార్టీ ద్రోహిగా మారాడన్నారు. సీఎం కేసీఆర్ తన అమ్మ, నాన్న పేర్లు తప్ప అన్ని అబద్ధాలే చెబుతారనీ, మారే మనిషి కాదనీ, ఇక ఆయన్ను అధికారం నుంచి మార్చడమే మిలిగిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ జాబితా ప్రకటనతోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అది ఆ పార్టీ అంతర్గత విషయమే అయినప్పటికీ మైనంపల్లి హనుమంతరావు తిరగుబాటు తదితర పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ లో ఇంకా తిరుగు బాట్లు ఉంటాయని చెప్పారు.వాడుకుని వదిలేయడం కేసీఆర్‌కు మొదట్నుంచి ఉన్న అలవాటేనని విమర్శించా రు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా సీఎం కేసీఆర్ ఓటమి, భయం కనబరిచారని ఎద్దేవా చేశారు. కామారె డ్డిలో కేసీఆర్‌పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం అసలు రూపం తెలుసు గనుకే…చింతమడకకు వెళ్లకుండా కామారెడ్డికి వెళ్లారని తెలిపారు. ఆయన అక్కడికి పారిపోతున్నారని తాను మొదట్నుంచి చెబుతున్నానని రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటకు పోకుండా రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీపై పోటీకి వెళ్లడమంటే మైనారిటీలను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. తొలుత 12.03 నిమిషాలకు బీఆర్‌ఎస్ జాబితా విడుదల అని చెప్పి ఆ సమయంలో మద్యం షాపుల కేటాయింపునకు డ్రా నిర్వహించడం ద్వారా కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలిసిందని ఎద్దేవా చేశారు.
రూ.2 లక్షల రుణమాఫీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. రైతులు బ్యాంకుల నుంచి రూ.2 లక్షల రుణం తీసుకోవాలని సూచించారు. రూ.99,999 వరకు మాత్రమే రుణమాఫీ పేరుతో అతి తెలివి ప్రదర్శించి సీఎం కేసీఆర్ రూ.11 వేల కోట్లు మిగుల్చుకున్నారని విమర్శించారు. రూ.ఒక లక్షకు ఒక్క రూపాయే తక్కువగా కనిపిస్తున్నా …దాంతో వేలాది మంది రైతులకు రుణమాఫి కావడం లేదని తెలిపారు.
అభివృద్ధిపై చర్చకు రావాలి
కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై ప్రశ్నిస్తున్న సీఎం కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 60 ఏండ్లలో బడ్జెట్ ఎంత? చేసిన అభివృద్ధి ఏంటీ? బీఆర్‌ఎస్ పాలించిన పదేండ్లలో బడ్జెట్ ఎంత? చేసిన అభివృద్ధి ఎంత? దీనిపౖౖె చర్చకు రావాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ కేసీఆర్ తాతలు కట్టారా?, గ్రామపంచాయతీలకు విద్యుత్ సౌకర్యం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మాణం తదితర అభివృద్ధి పనులు కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని తెలిపారు. తన బినామీల భూముల ధరలు పెంచడం కోసం సీఎం…. హైటెక్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో రూట్‌ను మార్చారని విమర్శించారు.
సమైక్య పాలన వివక్షను కాంగ్రెస్‌కు ఆపాదిస్తావా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య పాలనలో చోటు చేసుకున్న వివక్షను కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తున్నా రని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో, ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్‌కు ఆ పాపంలో భాగముందని రేవంత్ రెడ్డి తెలిపారు. టీడీపీలో రాష్ట్ర మంత్రిగా, అనంతరం యుపీఏలో కేంద్ర మంత్రిగా చేసిన కేసీఆర్ ఆ నిర్ణయాల్లో భాగమే కదా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ధర్నా చేయడం కాదు… సామాజిక న్యాయం చేయమని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించా లని…ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రేవంత్ సూచించారు.
కమ్యూనిస్టులను మోసం చేశారు…
‘సీఎం కేసీఆర్ తీరు….అవసరమున్నంత సేపు ఓడమల్లన్న…అవసరం తీరాక బోడి మల్లన్నలా ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులను వాడుకున్నారు. అదే కేసీఆర్, సూది, దబ్బణాల పార్టీలంటూ కమ్యూనిస్టు పార్టీలను హేళన చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు జెండాలు మోసే వారే లేరనీ, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎర్రజెండాలిచ్చి మోపిస్తున్నారని వ్యాఖ్యానించడం ద్వారా మంత్రి హరీశ్ రావు అవమానిం చారు. అందరిని వాడుకుని వదిలేసే అలవాటున్న సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులను నమ్మించి మోసం చేశారు. ఇంత అవమానించినా… అదే చూరు పట్టుకుని వేలాడతామంటే అది వారిష్టం. కమ్యూనిస్టులు ఆలోచించుకోవాలి. వామపక్షాలు గతంలో యూపీఏ హయంలో మాతో కలిసి పని చేశాయి. అప్పుడు సోమనాథ ఛటర్జీ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. కమ్యూనిస్టులు అధికారం కోసం తాపత్రాయపడే వారు కాదు. ప్రజా సమస్యలపై పోరాడేవారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలి….’ అని రేవంత్ సూచించారు.