84 మందితో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ

With 84 people Congress Working Committee– సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌కు స్థానం..
– 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులు
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)ని 84 మందితో పున ర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియామకాన్ని చేపట్టారు. ఇందులో 39 మంది సీడబ్ల్యూసీ జనరల్‌ సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది ఇంఛార్జ్‌లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు (యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌ అధ్యక్షులు) ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నియమితుల య్యారు. సభ్యుల్లో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ,మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అధిర్‌ రంజన్‌ చౌదరి, కమ్యూనికేషన్ల విభాగం ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ అసమ్మతి వర్గంగా పేరొందిన జి20 నేతలు ఆనంద శర్మ, ముకుల్‌ వాస్నిక్‌, కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన శశి థరూర్‌ వంటి నేతలకూ చోటు దక్కింది. అలాగే రాజస్థాన్‌ యువ నేత సచిన్‌ పైలట్‌, దీపా దాస్‌ మున్షి, సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌లను సీడబ్ల్యూసీలోకి కొత్తగా తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి అవకాశం
సీడబ్ల్యూసీ సభ్యుల్లో రఘువీరా రెడ్డికి అవకాశం లభించింది. అలాగే శాశ్వత ఆహ్వానితుల్లో టి.సుబ్బిరామి రెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహకు స్థానం దక్కింది. ప్రత్యేక ఆహ్వానితుల్లో పల్లం రాజు, వంశీ చంద్‌ రెడ్డికి కూడా స్థానం లభించింది.

Spread the love