– రోజు రోజుకు పెరుగుతున్న రోగులుొ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వ్యాధికారక సూక్ష్మజీవుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకునే కండ్లకలక కేసులు రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ కంటి ఆస్పత్రి సరోజినీ దేవి ఆస్పత్రికి సాధారణంగా ప్రతి రోజు మూడు, నాలుగు వచ్చేవి. అయితే గత కొద్ది రోజులుగా కండ్లకలకకు చికిత్స కోసం 300 నుంచి 400 మంది వస్తుండటం వ్యాధిగ్రస్తులు అనూహ్యంగా పెరిగిన తీరుకు అద్దం పడుతున్నది. వైరస్, బాక్టీరియా వల్ల ఈ కలకలు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా పాఠశాలల్లో చదివే పిల్లలు, గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో దీని వ్యాప్తి తీవ్రత ఎక్కువ. వైరస్, అలర్టీ వల్ల వచ్చే కలకలు కొద్ది రోజుల్లో తగ్గుతాయి. అయితే బాక్టీరియా వల్ల వస్తే కంటిపై ఎక్కువగా ప్రభావం చూపించడమే కాకుండా, దీంతో చూపు కూడా దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఒక వ్యక్తి ముక్కులో నుంచి ఆ వైరస్ ఇతరులకు కంటిస్రావాలు, చేతుల ద్వారా చేరుతుంది. చేతులను కండ్లలో పెట్టుకోవడం కూడా వ్యాధి సోకడానికి కారణమవుతున్నది. కాంటాక్ట్ లెన్స్ వాడే అలవాటు ఉన్న వారు వాటిని సరిగ్గా శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక కన్ను లేక రెండు కండ్లు ఎర్రగా మారడం, కండ్లలో మంట, నొప్పి, లేక దురద, కను రెప్పలు వాపు రావడం, కంటి రెప్పలు అతుక్కోవడం, ఎక్కువ వెలుగును చూడలేక పోవడం, కండ్ల నుంచి నీరు లేక చిక్కటి ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియా కారణంగా వచ్చే కండ్లల కలకలో చీము వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కను గుడ్డులో వ్యాప్తి చెందితే చూపు పోయే ప్రమాదం ఉంది. కండ్ల కలకలకు కారణమైన వైరస్ వల్ల సాధారణ జలుబు కూడా వస్తుంటుంది. చిన్న పిల్లల్లో జ్వరం వంటి లక్షణాలు కూడా గుర్తించవచ్చు. కండ్లకలక వచ్చినట్టుగా గుర్తిస్తే కండ్లు నలపడం, కంటిలో చేతులు పెట్టడం చేయకూడదని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం ఈ సందర్భంగా సూచించారు. శుభ్రమైన కర్చీఫ్ ఉపయోగించి కండ్లు తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ వాడే అలవాటున్న వారు వాటిని ఆపేయాలని తెలిపారు. తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలే…తప్ప సొంత వైద్యానికి వెళ్లొద్దని కోరారు.
ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే కండ్లకలక బారిన పడకుండా చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవాలి. తరుచూ కండ్లను ముట్టుకోడం మానేయాలి. కండ్లద్దాలు వాడడం వల్ల కండ్లు ముట్టుకోవడం తగ్గి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సమస్య ఉన్నప్పుడు జనంలో తిరగడం, స్విమ్మింగ్ పూల్స్ వాడడం వంటివి మానుకుంటే మంచిదని సూచించారు. కండ్ల కలకలు ఉన్న వారు వాడిన టవల్స్, కర్చీఫ్ లేదా చద్దర్లను ఇతరులు వాడకూడదని డాక్టర్ రాజలింగం హెచ్చరించారు.
అదనంగా పని చేస్తున్న సిబ్బంది
సాధారణ ఓపీ సమయం సరిపోకపోవడంతో అదనంగా వస్తున్న రోగుల కోసం సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో అదనపు సమయంలో కూడా సిబ్బంది పని చేస్తున్నారు. సోమవారం ఒక్కసారిగా రద్దీ పెరగడంతో వచ్చిన ప్రతి రోగిని చూడాలని సూపరింటెండెంట్ ఆదేశించారు. దీంతో మూసేసిన ఓపీ సేవలను మధ్యాహ్నం తిరిగి తెరిచారు.