– దృష్టి మరల్చటానికే ఎమర్జెన్సీ అంశం
– నీట్ పరీక్ష లీక్‌లపై మోడీ మౌనం
– ప్రధానిపై సోనియా ఆగ్రహం
న్యూఢిల్లీ : పార్లమెంటు మొదటి సెషన్‌లో డిప్యూటీ స్పీకర్, నీట్ సమస్యపై ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. సభలో మోడీ సర్కారు తీరుపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆరోపణలు చేశారు. ప్రధాని ఏకాభిప్రాయం విలువను బోధిస్తూనే.. ఘర్షణకు ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ఆంగ్ల పత్రిక సంపాదకీయంలో వివరించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఎన్డీఏ బలహీనమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావటంతో అది ప్రధానికి ఇంకా అవగాహనకు రాలేదని పేర్కొన్నారు. ”ప్రధానమంత్రి ఏమీ మారనట్టుగా ఉంటున్నారు. ఆయన ఏకాభిప్రాయ విలువని బోధిస్తారు కానీ ఘర్షణకు విలువ ఇస్తూనే ఉన్నారు. 18వ లోక్‌సభ ప్రారంభమైన మొదటి కొన్ని రోజులు దురదృష్టవశాత్తూ ప్రోత్సాహకరంగా లేవు. మారిన వైఖరిని మనం చూస్తామనే ఆశ పూర్తిగా దెబ్బతిన్నది. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని సంప్రదాయం ప్రకారం విపక్షాలకు ఇవ్వాల్సి ఉన్నది. 17వ లోక్‌సభలో రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయని పాలన.. ఈ సంపూర్ణ సహేతుకమైన అభ్యర్థన ఆమోదయోగ్యం కాదని గుర్తించింది” అని ఆమె ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమయంలో బీజేపీ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకేకు చెందిన ఎం.తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. అయితే, 2019-24 మధ్య ఆ పదవి ఖాళీగా ఉండటం గమనార్హం.
‘ఎమర్జెన్సీ’ అంశంతో కాంగ్రెస్‌పై బీజేపీ దాడికి దిగటంపై సోనియా స్పందించారు. రాజ్యాంగంపై దాడి నుంచి దృష్టిని మరల్చటానికి ప్రధాని ఈ సమస్యను తీసుకొచ్చారని సోనియా ఆరోపించారు. ”1977 మార్చిలో మన దేశ ప్రజలు ఎమర్జెన్సీపై నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. ఆ సమయంలో ప్రజా వ్యతిరేకతకు గురైన పార్టీకి ఓటర్లు మూడేండ్లలోనే అధికారం ఇచ్చారు. ఆ పార్టీ చరిత్ర సృష్టించింది. మోడీ, ఆయన పార్టీ ఎన్నడూ సాధించని మెజారిటీతో అధికారంలోకి రావడం కూడా ఆ చరిత్రలో చాలా భాగం” అని ఆమె తన సంపాదకీయంలో రాసుకొచ్చారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలు ఎమర్జెన్సీపై తమ ప్రసంగంలో వినిపించారు. వారు దీనిని ”చీకటి అధ్యాయం”, ”రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి” అని అభివర్ణించిన విషయం విదితమే.
మణిపూర్ జాతి హింసపై
మణిపూర్‌లో గతేడాది మేలో జాతి ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి కలహాలతో దెబ్బతిన్న మణిపూర్‌ను మోడీ సందర్శించక పోవటాన్ని సోనియా తప్పుబట్టారు. మణిపూర్‌లో కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా వందలాది మంది మరణించగా.. వేలాది మంది తమ స్వంత ప్రాంతాలను విడిచి వెళ్లిపోయిన విషయం విదితమే.
స్పందించిన బీజేపీ.. ఇండియా బ్లాక్ మద్దతు
సోనియా గాంధీ సంపాదకీయంపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై దాడి చేసే ముందు ఆమె తన కుటుంబ గతాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. సోనియా గాంధీకి ఇండియా బ్లాక్‌లోని ఆర్జేడీ, శివసేన (యూబీటీ) వంటి మిత్రపక్షాలు మద్దతు పలికాయి. శివసేన (యూబీటీ) నాయకుడు సంజరు రౌత్ కూడా ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఫలితాలు మోడీకి వ్యక్తిగత ఓటమని అన్నారు.
నీట్ పేపర్ లీక్ పై
దేశంలోని ప్రతిష్టాత్మక పరీక్ష అయిన నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసుపై మౌనంగా ఉన్న ప్రధాని మోడీపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు.పరీక్ష పే చర్చ” చేసే ప్రధాని.. దేశవ్యాప్తంగా చాలా కుటుంబాలను నాశనం చేసిన లీక్‌లపై స్పష్టంగా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) యూనివర్సిటీల వంటి విద్యాసంస్థల ప్రొఫెషనలిజం గత పదేండ్లలో తీవ్రంగా దెబ్బతిన్నదని కాంగ్రెస్ అగ్రనాయకురాలు నొక్కి చెప్పారు.