డాలర్‌ పెత్తనం – పర్యవసానాలు

అంతర్జాతీయంగా రిజర్వు కరెన్సీగా డాలర్‌కి ఉన్న హౌదాకి, సామ్రాజ్యవాదానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయి. అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి డాలర్‌కి ఉన్న హౌదాకి సంబంధం ఏమిటన్నది మొదటి భాగం అయితే, డాలర్‌ హౌదాకి, మొత్తం సామ్రాజ్యవాద ఆధిపత్య వ్యవస్థకి ఉన్న సంబంధం ఏమిటన్నది రెండో భాగం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంపదను దాచుకోడానికి డాలర్‌ ఒక మాధ్యమంగా ఉపయోగపడుతోంది. దానికి కారణం అంతర్జాతీయంగా ఏ దేశంలోనైనా డాలర్‌ను రిజర్వు కరెన్సీగా గుర్తిస్తారు. చరిత్రలో గతంలో ఇటువంటి హౌదా బంగారానికి, కొంతవరకు వెండికి చాలా కాలం పాటు ఉండేది. బంగారంతో పోల్చితే స్థిరంగా తమ విలువను నిలబెట్టుకోగలిగిన కొన్ని కరెన్సీలు (అంటే ఆ కరెన్సీలో బంగారం ధర పెరగకుండా స్థిరంగా ఉంటుందన్నమాట) రిజర్వు కరెన్సీ పాత్ర కొంతకాలం పోషించగలిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా బ్రెట్టన్‌వుడ్‌ వ్యవస్థలో (ఐఎంఎఫ్‌ -ప్రపంచబ్యాంక్‌ ఆధిపత్యం ఉన్న వ్యవస్థ) ఇదే పరిస్థితి కొంతకాలం కొనసాగింది. అయితే అధికారికంగా ప్రస్తుతం డాలర్‌ విలువ బంగారంతో పోల్చితే అంత స్థిరంగా లేదు. కాని ప్రపంచంలోని సంపన్నులంతా ఇప్పుడు కూడా బంగారం మీద ఎంత నమ్మకాన్ని ఉంచుతారో, డాలర్‌ మీద కూడా అదే నమ్మకంతో ఉంటారు.
డాలర్‌తో పోల్చితే తక్కిన దేశాల కరెన్సీల విలువలు (మన రూపాయి ఒక ఉదాహరణ) పడిపోతూవుంటాయి. కాని డాలర్‌ విలువ ఆ మాదిరిగా పడిపోదు. ఎందువల్ల? డాలర్‌ విలువ కొద్దిపాటి ఎగుడు దిగుడులకు లోనవుతుంది. కాని మొత్తంగా చూసినప్పుడు పడిపోదు. దానికి కారణం అమెరికాలో వేతనాల స్థాయి పెరగకుండా ఎప్పటికప్పుడు కిందకి తొక్కిపట్టి ఉంచుతారు. ఆ విధంగా ఉంచడానికి కావలసినమేరకు అక్కడ నిరుద్యోగ సైన్యం తగు మోతాదులో ఉండేలా చూస్తారు. అదే విధంగా మన దేశమూ చేస్తుంది కదా? మరి మన రూపాయి విలువ మాత్రం డాలర్‌తో పోల్చితే ఎందుకు పడిపోతోంది? అమెరికా మూడో ప్రపంచదేశాల మీద ఐఎంఎఫ్‌ షరతుల పేరుతోనో, రాజకీయంగా ఒత్తిడులు తీసుకువచ్చో ఆ దేశాలలో పండించే పంటల ధరలను, ఇతర సహజ వనరుల ధరలను తగ్గించేలా చేస్తుంది. దాని ఫలితంగా డాలర్‌ విలువ పడిపోకుండా నిలబడుతుంది. కాని ఆ మూడో ప్రపంచదేశాల కరెన్సీల విలువలు డాలర్‌తో పోల్చితే పడిపోతూవుంటాయి.
ఈ విధంగా డాలర్‌ను దాదాపు బంగారంతో సమానంగా ప్రపంచంలోని కుబేరులందరూ పరిగణిస్తున్నప్పుడు అమెరికా ఎప్పటికీ తరగని ఒక బంగారపు గనిమీద ఉన్నట్టేలెక్క. తన కరెన్సీ విలువను తగ్గించకుండానే అమెరికా తన బడ్జెట్‌ లోటును (డాలర్లను అదనంగా ముద్రించడం ద్వారా) భర్తీ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రపంచ సంపదను కేవలం డాలర్లలోనే దాచుకోరు. యూరో, పౌండ్‌-స్టెర్లింగ్‌, యెన్‌ వంటి కరెన్సీలలోనూ దాచుకుంటారు. దానికి కారణం ఆ కరెన్సీల దేశాలు తమ కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చితే పడిపోకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటాయి. (అవి కూడా సామ్రాజ్యవాద దేశాలే) మొత్తంగా డాలర్‌ను ఒక ప్రమాణంగా ఆ దేశాలు కూడా పరిగణించడంతో అమెరికా తన లోటు బడ్జెట్‌ను ఏ ఇబ్బందీ లేకుండానే భర్తీ చేసుకునే సదుపాయాన్ని పొందింది.
అయితే, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు అమెరికాలో బడ్జెట్‌లో, అంతర్జాతీయ వాణిజ్యంలో లోటు ఎందుకు ఏర్పడుతుంది? మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రను పరిశీలిస్తే, ఏ దేశం అయితే పెట్టుబడిదారీ వ్యవస్థకు నాయకత్వ పాత్ర పోషిస్తుందో, ఆ దేశం తక్కిన పెట్టుబడిదారీ దేశాలకు తన దేశ మార్కెట్‌లో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా వారి లాభాపేక్షకు వీలు కల్పిస్తుంది. అలా వీలు కల్పించడం ద్వారా తన నాయకత్వ పాత్రను నిలుపుకోగలుగుతుంది. అప్పుడు ఆయా దేశాలనుండి పెద్ద ఎత్తున వచ్చిపడే సరుకుల కారణంగా నాయకత్వ స్థానంలో ఉండే దేశానికి వాణిజ్యలోటు ఏర్పడుతుంది. బ్రిటన్‌ పెట్టుబడిదారీ ప్రపంచానికి నాయకుడుగా ఉన్న కాలంలో యూరప్‌ ఖండంలోని తక్కిన పెట్టుబడిదారీ దేశాలతోను, అమెరికాతోను నడిపే వాణిజ్యంలో ఎప్పుడూ లోటు ఏర్పడుతూనేవుండేది. ఆ లోటును పూడ్చుకోడానికి బ్రిటన్‌ తన వలసలలో ఉన్న బంగారం నిల్వలను, విదేశీ మారకపు నిల్వలను కొల్లగొట్టింది. పాలనా వ్యయం పేరుతో రకరకాల రూపాలలో ఆ సంపదను కాజేసింది. దానికి తోడు, వలసదేశాలలో ఉన్న స్థానిక పరిశ్రమలను దెబ్బతీసే విధంగా తన దేశంలోని ఉత్పత్తులను వలసదేశాలలో కుమ్మరించింది. ఇదెంతదాకా పోయిందంటే బ్రిటన్‌కు వాణిజ్యలోటు అంతా భర్తీ అయిపోవడమేగాక, మిగులు కూడా పోగైంది. ఆ మిగులును పెట్టుబడిగా యూరప్‌దేశాలకు, తెల్లవారు ఎక్కడెక్కడ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూవచ్చారో, ఆ ప్రాంతాలకు ఎగుమతి చేసింది.
ఇప్పుడు అమెరికా అదే మోతాదులో మూడో ప్రపంచ దేశాలనుండి కొల్లగొట్టడం సాధ్యం కాదు. ఆయా దేశాలలోని స్థానిక పరిశ్రమలను దెబ్బ తీయడమూ అదే మోతాదులో సాధ్యపడదు. అందుచేత పెద్ద స్థాయిలో వాణిజ్యలోటును కొనసాగించి ఆ లోటును భర్తీ చేయడానికి డాలర్లను అదనంగా ముద్రించడం తన వ్యూహంగా అమలు చేస్తోంది. ఈ వ్యూహం విజయవంతంగా అమలు కావాలంటే పెట్టుబడిదారీ ప్రపంచంలో డాలర్‌ ఆధిపత్యం కొనసాగడం చాలా కీలకం అవుతుంది. అలా అమెరికా ఆధిపత్యం కొనసాగడం మీద అమెరికా లోపల సాగే ఆర్థిక కార్యకలాపాలు కూడా ఆధారపడివుంటాయి. మామూలుగా ఏ దేశం అయినా తన దేశీయ డిమాండ్‌ను పెంచడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ఇప్పటి పరిస్థితులలో సాధ్యం కాదు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ విధించే షరతుల వలన తన బడ్జెట్‌ లోటును పెంచడం గాని, కార్పొరేట్లమీద అదనపు పన్నులు విధించడం గాని ఒక పరిమితిని దాటి సాధ్యపడదు. కాని అటువంటి పరిమితులు ఏవీ అమెరికా విషయంలో వర్తించవు. డాలర్‌ ఆధిపత్యమే దీనికి కారణం. డాలర్‌ దాదాపు బంగారంతో సమానం అని పరిగణించే పరిస్థితి ఉన్నందున అమెరికా నుండి పెట్టుబడులు ఇతర దేశాలకు పెద్ద ఎత్తున తరలిపోయే ప్రమాదం ఉండదు. అందుచేత అమెరికా ఎంత వ్యయం చేస్తుందో దానిని బట్టే మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచపు ఆర్థిక కార్యకలాపాలన్నీ సాగుతాయి. దానిని బట్టే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉపాధి కల్పన ఉంటుంది.
ఒకవేళ డాలర్‌ అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా లేదు అనుకోండి. అప్పుడు పరిస్థితి ఏవిధంగా ఉంటుంది? తన విదేశీ వాణిజ్య లోటును భర్తీ చేసుకోడానికి అమెరికా డాలర్‌ విలువను తగ్గించుకోవలసివస్తుంది. అలా తగ్గించుకోవడం వలన ఫలితం రావాలంటే, దేశంలోని కార్మికుల నిజవేతనాలు పెరగకుండా నియంత్రించాలి. అలా నియంత్రించినప్పుడు కార్మికవర్గం ప్రతిఘటించకుండా ఉండాలంటే, వారికి పోటీగా రిజర్వు సైన్యం (అంటే నిరుద్యోగం) బాగా పెరగాలి. ఇంత చేసినా, తక్కిన పెట్టుబడిదారీ దేశాలనుండి వాణిజ్యపోటీని ఎదుర్కొవడం తప్పదు. అంటే, డాలర్‌ గనుక అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా లేకపోతే అమెరికా పెట్టుబడిదారీ ప్రపంచానికి నాయకత్వ స్థానంలో ఉండటం సాధ్యం కాదు. పైగా తక్కిన సంపన్న పెట్టుబడిదారీ దేశాలతో పీకలు తెగ్గోసుకునే వాణిజ్యపోటీలో దిగబడవలసివచ్చేది. పైగా అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్నకొద్దీ పెట్టుబడిదారీ ప్రపంచంలో కొనుగోలుశక్తి పరిమితం అయిపోయి, ఆర్థిక కార్యకాలపాల స్థాయి అంతకంతకూ తగ్గిపోతూ ఉంటుంది. ప్రభుత్వాలు అటువంటి స్థితిలో జోక్యం చేసుకోడానికి వీలులేకుండా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధించిన షరతులు ఎటుదిరిగీ ఉండనేవున్నాయి.
దీనిని బట్టి డాలర్‌ ఆధిపత్యం కొనసాగడం అనేది కేవలం అమెరికాకే గాక, యావత్తు పెట్టుబడిదారీ ప్రపంచానికీ ప్రయోజనకరంగా ఉంటుంది అనేది స్పష్టం అవుతుంది. అదే సమయంలో ఈ ఆధిపత్యం సామ్రాజ్యవాద పెత్తనాన్ని నిలుపుకోడానికి కూడా తోడ్పడుతుంది.
అమెరికన్‌ డాలర్‌ అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ మాత్రమే కాదు. అంతర్జాతీయంగా చెలామణీలో ఉన్న కరెన్సీ కూడా. వాస్తవానికి ఆ విధంగా అంతర్జాతీయంగా చెలామణీలో లేకపోతే అది అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ స్థానాన్ని పొందగలిగేది కాదు. ఇప్పుడు ఒక దేశం మరొక దేశంతో వ్యాపారం చేయాలంటే డాలర్లు కావాలి.
మూడవ ప్రపంచపు ఉష్ణ మండల ప్రాంతాల్లో లభించే ముడిసరుకుగాని, ఆ దేశాల్లో ఉత్పత్తి అయే సరుకుగాని ప్రపంచ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు సరిపడా లేకపోతే, అంటే, దానికి కొరత ఏర్పడితే, అప్పుడు దాని ధర పెరుగుతుంది. ఒకానొక దేశంలో ఆ సరుకు మాత్రమే ప్రధాన ఉత్పత్తిగా ఉంటే అటువంటి దేశంలో ఈ ధర పెరిగినందువలన ఏర్పడే ద్రవ్యోల్బణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే అనేక సరుకులను ఉత్పత్తి చేసే దేశంలో ఈ సరుకు కూడా ఒకటిగా ఉంటే అప్పుడు ఆ దేశంలో ద్రవ్యోల్బణం ప్రభావం సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. ముడిసరుకు ఎక్కువగా మూడో ప్రపంచ దేశాలలో ఉత్పత్తి అవుతుంది. సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో దానిని ఉపయోగించి తయారు చేసే సరుకుల విలువ ఎక్కువగా ఉంటుంది. అందుచేత మూడవ ప్రపంచ దేశాలలో ద్రవ్యోల్బణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తే అప్పుడు ద్రవ్య పెట్టుబడి ఆ దేశాలనుండి ముందే బయటకు జారుకుంటుంది. దానివలన నిజంగానే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అప్పుడు ఆ దేశపు కరెన్సీ విలువ డాలర్‌తో పోల్చితే తగ్గుతుంది. ఆ తగ్గుదలను అరికట్టడానికి ఆ దేశం మీద పొదుపు చర్యలను షరతుగా విధిస్తారు. ఆ చర్యల ఫలితంగా నిరుద్యోగం పెరుగుతుంది. నిజవేతనాలు కూడా తగ్గుతాయి.
అప్పుడు ఆ మూడో ప్రపంచ దేశాలలో డిమాండ్‌ తగ్గుతుంది. తాము ఉత్పత్తి చేసే ముడిసరుకును ఆ దేశాలు అనివార్యంగా సామ్రాజ్యవాద దేశాలకు ఎగుమతి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం ఏర్పడింది గనుక ఆ ముడిసరుకు ధర డాలర్‌లలో లెక్కించినప్పుడు అంతకు ముందు ఉన్న రేటుకే సామ్రాజ్యవాద దేశాలకు లభిస్తుంది. డాలర్‌ గనుక అంతర్జాతీయ కరెన్సీగా లేకపోతే మూడో ప్రపంచదేశాలకు వాణిజ్యంలో డాలర్ల అవసరం ఉండదు. అప్పుడు జరిగే అంతర్జాతీయ వ్యాపారంలో ఆ దేశాలు నష్టపోవు. ఆ విధంగా డాలర్‌ ఆధిపత్యం సామ్రాజ్యవాద దోపిడీకి పునాదిగా వర్తమాన ప్రపంచంలో ఉపయోగపడుతోంది.
అయితే, ఇప్పుడు డాలర్‌ ఆధిపత్యం సవాలును ఎదుర్కుంటోంది. ఆయా దేశాలు తమ తమ స్వంత కరెన్సీలలోనే ఉభయత్రా అంగీకారంతో వ్యాపారం చేసుకోడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. బ్రిక్స్‌ దేశాల నడుమ సాగుతున్న వాణిజ్య ఒప్పందాలు అటువంటివే. సంపన్న పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశాలన్నీ ఈ పద్ధతికే మొగ్గు చూపుతున్నాయి. దీని వలన వెంటనే డాలర్‌ ఆధిపత్యం దెబ్బ తినిపోయే పరిస్థితి లేదు కాని, దాని ఆధిపత్యం బలహీనపడే క్రమం మొదలైందని చెప్పవచ్చు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love