– రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ ప్రయత్నం
– బడుగు, బలహీనవర్గాల హక్కులు లాక్కొంటోంది
– ధనికులకు రూ.16లక్షల కోట్లను మోడీ మాఫీ చేశారు
– తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు
– ప్రతి మహిళా ఖాతాలో ఏటా రూ.లక్ష జమ : నిర్మల్, గద్వాల జనజాతర సభల్లో.. ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ
– దేశంలో అభద్రతలో మైనార్టీలు
నవతెలంగాణ- ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధులు
దేశంలో బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందని, ఇదే జరిగితే రిజర్వేషన్లు తొలగిపోతాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీల హక్కులను బీజేపీ లాక్కొనే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ విధ్వంసానికి, ప్రజల హక్కుల పరిరక్షణకూ మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. కొద్ది మంది ధనికులకు లాభం చేసేందుకే మోడీ పనిచేస్తున్నారని, 22 కార్పొరేట్ కుటుంబాలకు రూ.16లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, అదే తాము రైతులకు రుణమాఫీ చేస్తామంటే రైతులను సోమరిపోతులను చేస్తున్నారని మమ్మల్ని గోడీ మీడియా ప్రశ్నిస్తోందని తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజవకర్గాల ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నిర్మల్ జిల్లా కేంద్రం, గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర నిర్వహించిన ఎన్నికల జనజాతర సభలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం అంటే రిజర్వేషన్లను తొలగించడమేనని చెప్పారు. రాజ్యాంగాన్ని కూలగొట్టడం ద్వారా బీజేపీ రిజర్వేషన్ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 50శాతం ఉన్న రిజర్వేషన్లను మరింత పెంచుతామని తెలిపారు. 80శాతం ఉన్న పేదలకు నిధులు అందించడంతో పాటు వారి హక్కులు పరిరక్షిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటికే ఆరు గ్యారంటీల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను దేశంలోనూ అమలు చేసేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలోని ప్రతి మహిళ ఖాతాలో ఏడాదికి రూ.లక్ష వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీనిచ్చారు. ఇందుకు సంబంధించి పేదల జాబితా తయారుచేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డిప్లమా, డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు శిక్షణ అందించి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని, బాగా పనిచేసిన వారికి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఆదివాసీలకు భూమి మీద సర్వహక్కులు కల్పిస్తామన్నారు. మంత్రి సీతక్క సూచన మేరకు ఉపాధిహామీ చట్టంలో భాగంగా ప్రస్తుతం సగటు కూలి రూ.250వరకు వస్తుందని, తాము అధికారంలోకి రాగానే రూ.400 చేస్తామని చెప్పారు. మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆదిలాబాద్ నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని పిలుపునిచ్చారు.