– 1976లో పేదల కోసం భూసేకరణ
– 4.3 ఎకరాల్లో దళితులు, పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు
– ధరణిలో పాత పట్టాదారుడి పేరు నమోదు
– వారసత్వం పేర దొడ్డిదారిన విక్రయం
– గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు
– మా భూమి ఇవ్వాలంటున్న పేదలు
– ఆర్డీఓకు బాధితుల ఫిర్యాదు
రెవెన్యూ అధికార యంత్రాంగం చట్టాల్లోని లొసుగుల్ని ఆసరా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేద దళితులకు ఇండ్ల స్థలాల కోసం సేకరించిన భూమినే తిరిగి పాత పట్టాదారుడికి రిజిస్ట్రేషన్ చేసి కాజేసే కుట్ర సాగుతోంది. ఐదు దశాబ్దాల కిందట అప్పటి ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాల కోసం సేకరించిన భూమిని తిరిగి ధరణిలో పాత పట్టాదారుడి పేరున చేర్చారన్న వార్తతో పేదలు ఆందోళన చెందుతున్నారు. దొడ్డిదారిన పౌతీ చేసి తర్వాత విక్రయించేందుకు రెవెన్యూ అధికారులే సహకరించినట్టు తెలిసింది. భూముల విలువ పెరగడంతో పాత పట్టాదారులు, ఓ సంపన్నుడు మిలాకత్ అయి ఇండ్ల స్థలాల భూముల్లో వెంచర్ చేసేందుకు పూనుకున్నట్టు సమాచారం. వందల కోట్ల విలువ చేసే భూమిని కాజేసే కుతంత్రానికి అధికారులు సైతం జీ హుజూర్ అనడం విశేషం. పాత రికార్డుల్ని పరిశీలించకుండానే గుడ్డిగా భూముల్ని మార్చేడం వెనకాల పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. దీనిపై బాధితులు తహసీల్దార్, ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టాలిచ్చిన స్థలాన్ని కాపాడి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతపెట్టు దూరంలో ఉన్న గౌడిచర్ల గ్రామ రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 653లో భానూరు భూమయ్య అనే వ్యక్తికి 403 ఎకరాల పట్టా భూమి ఉన్నది. ఆయనకు పక్కనే ఉన్న ఇస్మాయిల్‌ఖాన్ పేట గ్రామంలోనూ ఎకరాల కొద్ది భూములున్నాయి. గౌడిచర్ల గ్రామంలోని ఆయన భూమిని పేదలకు ఇండ్ల స్థలాల కోసం 1976లో అప్పటి ప్రభుత్వం సేకరించింది. సర్వే నెంబర్ 653లో ఉన్న 403 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గ్రామంలో నిరుపేదలైన దళితులు, ఇతర బీసీ కులాల్లోని పేదలకు పట్టాలిచ్చారు. 40 మంది వరకు దళితులున్నాయి. వారికి ఇండ్ల స్థలాల్ని మంజూరు చేసి పట్టా సర్టిఫికెట్లు జారీ చేసింది. ఆ స్థలాల్లో 15 నుంచి 20 మంది వరకు ఇండ్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఇంకొందరికి ఆర్థిక స్థోమత లేక పశువుల కొట్టాలు వేసుకుని కబ్జాలో ఉన్నారు. క్రమక్రమంగా ఒక్కొక్కరుగా ఇండ్లు కట్టుకుంటున్నారు. దళితులతోపాటు అదే గ్రామానికి చెందిన బీసీ కులాల్లోని పేదలకు కూడా ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం భూమిని సేకరించి సర్టిఫికెట్లు ఇచ్చింది. వాళ్లంతా నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.
ధరణిలో పాత పట్టాదారు పేరిట భూమి
ధరణి పోర్టర్ వచ్చే ముందు రెవెన్యూ అధికారులు తమ ఇష్టారాజ్యంగా భూముల పట్టాల చేర్పులు మార్పులు చేసిన విషయం తెలిసింది. గౌడిచర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 653లోని 4.03 ఎకరాల ఇండ్ల స్థలాల భూమి తిరిగి ధరణిలో పాత పట్టాదారుడైన భానూరు భూమయ్య పేరున ఎక్కింది. దీంతో ఆయన వారుసులు తమ పేరిట పౌతి చేయించుకున్నారు. చక్రపాణి పేరిట 17 గుంటలు, కాశీనాథ్ పేరిట 34 గుంటలు, పద్మావతి పేర 35 గుంటలు, జీవన్‌ప్రకాశ్ పేర 18 గుంటలు, రమాఖాంత్ పేరిట పదిహేడున్నర గుంటల చొప్పున పౌతి చేశారు. దీని వెనుక రెవెన్యూ అధికారులు పెద్ద తతంగం నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇండ్ల స్థలాల భూమి విక్రయం
పేద దళితుల ఇండ్ల స్థలాల కోసం సేకరించిన భూమిని తిరిగి ధరణిలో పాత పట్టాదారు పేరున మార్చాక.. భానూరి భూమయ్య వారసులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇటీవల భూమయ్య వారసులు తమ భూమిగా క్లెయిమ్స్ చేసుకుంటూ మరో వ్యక్తికి విక్రయించారు. గౌడిచర్లలో దళిత పేదలకు పట్టాలిచ్చిన జాబితాలో పేరున్న కుటుంబానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి ఇటీవల దశల వారీగా భూమిని కొనుగోలు చేశారు. మొదట సర్వే నెంబర్ 653అ/2లో 20 గుంటలు రిజిస్ట్రేషన్ చేశారు. దానిపైన ఎవరూ అభ్యంతరం తెల్పలేదని చెప్పి తర్వాత నాలుగు దశల్లో 653/ఆ/1/2లో 10 గుంటలు, 653 /ఆ/2లో 10 గుంటలు, 653 అ/ఇ/2లో 10 గుంటలు, 653 ఆ1/2లో 10 గుంటల భూమి కలిపి 1.20 భూమిని కొనుగోలు చేశారు. కోట్ల విలువ చేసే భూమి కావడంతో రెవెన్యూ అధికారులు చట్టంలోని లొగుసుల్ని ఆసరా చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించి పేదల భూముల్ని కాజేసే కుట్రలో భాగస్వామ్యమయ్యారనే విమర్శలున్నాయి.
భూముల కోసం దళితుల ఆందోళన
తమ ఇండ్ల స్థలాలు తమకు దక్కేలా చూడాలని కోరుతూ దళిత లబ్ధిదారులు అధికారులకు మొరపెట్టుకున్నారు. తహసీల్దార్, ఆర్డీఓలను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమ స్థలాలను కాజేయాలని చూస్తున్న వ్యక్తులతోపాటు తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్స్ చేసిన అధికారులపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
భూ రికార్డుల్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం : రాజు, ఆర్డీఓ
గౌడిచర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 653లో ఉన్న 4.3 ఎకరాల భూమిని పేదల ఇండ్ల స్థలాల కోసం 1976లో సేకరించినట్టు బాధితులు చెబుతున్నారు. అలా ప్రభుత్వం భూ సేకరణ చేసిన తర్వాత తిరిగి పాత పట్టాదారుడి పేరిట ధరణిలో ఎక్కించడం వల్లే అతను పట్టాదారుగా ఇతరులకు విక్రయించాడు. ఆ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. పేదలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి
దళితులకు ఇండ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని తిరిగి ధరణిలో పాత పట్టాదారు పేరున చేర్చడమే కాకుండా అతని వారసులకు పౌతి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కోట్లు విలువ చేసే భూముల్ని కాజేసేందుకు పాత పట్టాదారులు, దళితుల్లోని ఓ పెద్ద మనిషి, రెవెన్యూ అధికారులు కలిసి పేద దళితులకు అన్యాయం చేయాలని చూశారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ జోక్యం చేసుకుని గౌడిచర్ల దళితుల ఇండ్ల స్థలాల భూమిని కాపాడాలి. పాత పట్టాదారుల పేరిట జరిగిన రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి.
–– అశోక్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
50 ఏండ్ల కిందటే పట్టాలు
మాకు 50 ఏండ్ల కిందటనే సర్కార్ ఇండ్లు కట్టుకునేందుకు స్థలాలిచ్చింది. పట్టా సర్టిఫికెట్లు అందజేసింది. కొందరు ఇండ్లు కట్టుకున్నారు. కొంతమంది ఆ స్థలంలో దొడ్లు, కట్టెలు, గడ్డి వేసుకుని కబ్జాలోనే ఉన్నాం. మాకు చెందిన భూమిని ఓ వ్యక్తి కొనుగోలు చేసి మట్టి పోస్తున్నాడు. వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముకునే ప్లాన్‌లో ఉన్నారు. అధికారులు మా భూమిని మాకు ఇప్పించాలి.
– బేగరి బాలయ్య, గౌడిచర్ల