రంగారెడ్డి కలెక్టరేట్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Constable commits suicide in Rangareddy Collectorate– ‘నేను చేస్తున్నది తప్పే అయినా.. బతకాలని లేదు’
– తన చావుకు ఆర్థిక సమస్యలు కారణం కాదు
– కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌ కలకలం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
‘అమ్మానాన్న నేను చేస్తున్నది తప్పే.. కానీ బతకాలని లేదు. జీవితంపై విరక్తి చెందాను. అక్క పిల్లలను మంచిగా చూసుకోండి. నా చావుకు ఆర్థిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు కారణాలు కాదు. ఇప్పటికే ఆత్మహత్య చేసుకొని చులకనయ్యాను. దయచేసి నేను చనిపోయిన తర్వాత లేనిపోని నిందలు వేయకండి.’ అంటూ ఓ కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జరిగింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ(28) రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి డ్యూటీకి వచ్చాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున తన తుపాకితో బాత్‌రూమ్‌లో కాల్చుకొని చనిపోయాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాసి బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానిస్టేబుల్‌ తండ్రి దూసరి సత్తయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే క్రైమ్‌ డీసీపీ కరుణాకర్‌, ఎస్‌బీ డీసీపీ ఘటనా స్థలానికి క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. బాలకృష్ణ గతంలో ఓసారి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. కాగా, కానిస్టేబుల్‌ బాలకృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో స్వగ్రామం మంచాలలో జరిగాయి. అంత్యక్రియల్లో గ్రామస్తులు, స్నేహితులు, పోలీసులు సిబ్బంది భారీగా పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు చివరి వరకు అక్కడే ఉన్నారు. అయితే కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌పై గ్రామంలో చర్చలు సాగుతున్నాయి గతంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ చేస్తూనే అప్పుల పాలైనట్టు పలువురు చర్చించుకున్నారు. బాలకృష్ణ మరణంతో మళ్లీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యవహారం తెరమీదికి వచ్చింది.
అమ్మా నిందలు భరించలేక చనిపోతున్నా..అంటూ సూసైడ్‌ నోట్‌
‘అమ్మానాన్న నేను చేస్తున్నది తప్పే.. కానీ నాకు బతకాలని లేదు. జీవితం రోజు ఒక నరకంలా ఉందని, ఆత్మహత్య చేసుకోవద్దని ఎంత కంట్రోల్‌ చేసుకున్నా నా వల్ల కావడం లేదు. జీవితంలో ఏదో కోల్పోతున్నాననే బాధ నాలో ఉంది. మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతానేమో అనుకుంటున్నా. జీవితంలో ఫస్ట్‌ టైం ఆత్మహత్యాయత్నం చేసి తప్పు చేశాను. దాని వల్ల నా ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో, గ్రామంలో నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. ఆ నిందలు ఇప్పటికీ భరించలేకపోతున్నాను. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. అందుకే చనిపోదాం అనుకున్న. నా చావుకు నేనే కారణం. నాకు ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వంటివి లేవు. దయచేసి నేను చనిపోయిన తర్వాత నా మీద లేని పోనీ నిందలు వేయొద్దు’ అని కానిస్టేబుల్‌ సుసైడ్‌ నోట్‌ రాశాడు. ఇది చదివిన గ్రామస్తులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Spread the love