– ప్రజల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెడతా..
– మిర్యాలగూడ సీపీఐ(ఎం) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి
”పోరాటాల గడ్డగా నిలిచిన మిర్యాలగూడలో ఎర్రజెండా ఎగరడం ఖాయం.. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే నియోజవర్గ అభివృద్ధి జరిగింది” అని సీపీఐ(ఎం) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చి జిల్లా సాధిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజల నుంచి తనకు విశేష ఆదరణ లభిస్తున్నదని, తన గెలుపు ఖాయమని జూలకంటి రంగన్న నవతెలంగాణకు వివరించారు.
మీ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేశారు?
మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 1994, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా పనిచేశాను. 1999, 2004లో పాత మిర్యాలగూడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. నియోజవర్గం మొత్తం ఆయకట్టు కింద ఉండటం వల్ల ప్రతి ఎకరాకు నీరు అందేలా ఎడమ కాలువ మేజర్లు, మైనర్లు మరమ్మతులు చేయించా. 2009లో కొత్తగా ఏర్పడిన నియోజకవర్గంలో ఆలగడప, భీమవరం బ్రిడ్జిలను నిర్మించాను. దీనివల్ల ప్రజలకు రాకపోకల సౌకర్యం ఏర్పడింది. అడివిదేవులపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు, మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు హనుమాన్ పేట వద్ద బ్రిడ్జి నిర్మించాం.ఎన్‌ఎస్‌పీ క్యాంపులో సుందరయ్య పార్కుతో పాటు నిరుద్యోగుల కోసం లైబ్రరీని ఏర్పాటుచేయించాం. చైతన్య నగర్‌లో బోటింగ్ పార్కు ఏర్పాటు చేయించాను. కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి, ఏరియాస్పత్రిని వంద పడకల హాస్పటల్‌గా పెంపుదల, పట్టణ నడిబొడ్డులో రైతు బజార్ తదితర ప్రజలకు అవసరమైన పనుల చేయించాను.
ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు మీకు ఉన్న తేడా..?
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు, కమ్యూనిస్టు అభ్యర్థినైన నాకు చాలా తేడా ఉంది. వాళ్లు డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్నాను. బీఆర్‌ఎస్ అభ్యర్థి భాస్కరరావు నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నదానం, మజ్జిగ పంపిణీ లాంటివి చేసి సామాజిక సేవ ముసుగులో రాజకీయం చేస్తున్నారు.
అతను సీపీఐ(ఎం) మద్దతుతో వార్డు కౌన్సిలర్‌గా గెలిచి రూ.2 కోట్ల సొంత నిధులతో వార్డును అభివద్ధి చేస్తానని హామీ ఇచ్చి ముఖం చాటేసాడు. వార్డు ప్రజల బాగోగులు చూడలేని అభ్యర్థి ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు. నేను ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని వార్డుల్లో ప్రచారాన్ని పూర్తి చేశాను. రెండో దశలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా.