రాజ్యాంగమే రక్షణ కవచం

Priyanka – పౌరులకు రక్షణగా ఉంటుంది
– అందరినీ ఐక్యంగా ఉంచుతుంది
– రాజ్యాంగసూత్రాలకు విరుద్ధంగా బీజేపీ
– ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో మార్చేకుట్ర
– లౌకిక స్ఫూర్తిని, శాస్త్రీయ భావనలను తొలగించే యత్నం
– ప్రమాదంలో ప్రజల హక్కులు : సీపీఐ(ఎం) ఎంపీ ఆర్‌. సచ్చితానందం
– దీన్ని బద్దలు కొట్టేందుకు కేంద్రం యత్నొం రిజర్వేషన్లను బలహీనపరిచే కుట్ర
– ఇది సంవిధాన్‌…సంఘ్ బుక్‌ కాదు : కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక ధ్వజం
ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా పార్లమెంట్‌లో 75 ఏండ్ల రాజ్యాంగదినోత్సవంపై చర్చతో లోక్‌సభ వేడెక్కింది.ప్రతిపక్షాల తరఫున సీపీఐ(ఎం) ఎంపీ ఆర్‌. సచ్చితానందం, వాయనాడ్‌ నుంచి తొలిసారి అడుగుపెట్టిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ సహ పలువురు ఎంపీలు తమదైన శైలిలో రాజ్యాంగ హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తున్న తీరును ఎండగట్టారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశానికి రాజ్యాంగం ఒక రక్షణ కవచమని, దాన్ని బద్దలు కొట్టేందుకు గత పదేండ్లుగా కేంద్రం చేయని ప్రయత్నమంటూ లేదని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్ర వారం లోక్‌సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆమె మాట్లాడారు. లోక్‌సభలో తొలిసారి ప్రసంగించిన ప్రియాంకా గాంధీ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రాజ్యాంగం దేశానికి ఒక సురక్షా కవచం. ఇది దేశ పౌరులకు రక్షణ కల్పిస్తుంది. న్యాయం చేస్తుంది. హక్కులను కాపాడుతుంది. పౌరుల ఐక్యమత్యం, భావ ప్రకటనా స్వేచ్ఛకు కవచం. ఇలాంటి రక్షా కవచాన్ని బద్దలు కొట్టేందుకు బీజేపీ గత పదేండ్లుగా అన్ని రకాల ప్రయత్నాలూ చేయడం బాధాకరం’ అని అన్నారు. పదేండ్లుగా అధికారంలో ఉన్న వాళ్లు చాలా పెద్దమాటలే చెబుతూ, రాజ్యాంగం హామీ ఇచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమనే కవచానికి తూట్లూ పొడుస్తున్నారని తప్పుపుట్టారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు
విధానాల రూపకల్పనకు కులగణన దోహదం
‘రాజ్యాంగం దేశ పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా ఇస్తుంది. అలాంటి రాజ్యాంగాన్ని బద్దలు కొట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రయివేటీకరణతో రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్త్తోన్నది’ అని ఎంపీ ప్రియాంకాగాంధీ ఆరోపించారు. కులగణన విషయంలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఆమె మండిపడ్డారు. గతంలో కులగణన ఎందుకు చేపట్టలేదని పాలకులు ప్రశ్నిస్తున్నారని, ప్రస్తుతం గురించి అడుగుతుంటే గతం సంగతి దేనికని ఆమె ప్రశ్నించారు. కులగణన జరపకుండా కేంద్రం తప్పించుకుంటోందని విమర్శించారు. కులగణన ఇప్పటి అవసరమని, విధానాల రూపకల్పనకు ఎంతో దోహదపడుతుందని అన్నారు.
‘దేశంలో ప్రతి దానికీ బీజేపీ ప్రభుత్వం నెహ్రూ హయాం గురించే మాట్లాడుతోంది. నెహ్రూ హయాంలో అదెందుకు చేయలేదు? ఇదెందుకు చేయలేదని అంటోంది. అధికారంలో లేకున్నా, బతికి లేకున్నా దేశం పూర్తి బాధ్యత నెహ్రూదేనా..?’ అని ప్రియాంకా గాంధీ కేంద్ర సర్కారును నిలదీశారు. ‘ప్రతిదానికి నెహ్రూ పేరు ఎత్తేవాళ్లు.. దేశం కోసం వాళ్లు ఏం చేస్తున్నారో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. దేశంలో జరిగే అన్నింటికీ నెహ్రూనే కారణమని బీజేపీ మాట్లాడుతోందని, ఆయన జ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటం, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. గత పదేండ్లలో దేశ ప్రగతి కోసం ఏం చేశారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రస్తుత పాలకులు మాట్లాడాలని తెలిపారు. ఇది సంవిధాన్‌ అని, సంఘ్ బుక్‌ కాదని విమర్శించారు.
అదానీ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడటం వల్లే వ్యూహాత్మకంగా లోక్‌సభను సజావుగా నడవనీయడం లేదని ఆమె విమర్శించారు. ”సంభాల్‌ బాధిత కుటుంబాలకు చెందిన కొందరు నన్ను కలుసుకునేందుకు వచ్చారు. వారిలో ఇద్దరు పిల్లలూ ఉన్నారు. ఒకరికి నా కుమారుడి వయస్సు ఉంటుంది. మరొకరికి 17 ఏండ్లు. వాళ్ల తండ్రి ఒక టైలర్‌. ఆయనకు ఒక డ్రీమ్‌ ఉంది. తన పిల్లలను బాగా చదివించి ఒకరిని డాక్టర్‌ను, మరొకరిని జీవితంలో స్థిరపడేలా చేయాలని అనుకునేవాడు. కానీ ఆయనను పోలీసులు కాల్చి చంపారు. తాను పెరిగి పెద్దయ్యాక తన తండ్రి కోరిక మేరకు డాక్టర్‌ అవుతానని 17 ఏండ్ల అద్నాన్‌ చెప్పాడు. అతని మనసులో అలాంటి ఆశలు, కలలకు అవకాశం కల్పించింది భారత రాజ్యాంగమే” అని ప్రియాంకా గాంధీ అన్నారు.
అదే విధంగా ఉన్నావో ఘటన, నిరుద్యోగం, వాయనాడ్‌లో కొండచరియల బీభత్సం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రియాంక తన చర్చలో ప్రస్తావించారు. తాను ఉన్నావోలో లైంగికదాడి బాధితురాలి ఇంటికి వెళ్లానని, ఆమె తండ్రిని కలిశానని, వారు వ్యవసాయ భూమిని తగులపెట్టారని, సోదరులను కొట్టారని, తమకు న్యాయం జరగాలని బాధిత కుటుంబం వాపోయిందని ఆమె సభ దృష్టికి తీసుకెళ్లారు. భారత రాజ్యాంగం మహిళలకు అధికారం ఇచ్చిందని, కానీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని, తమ హక్కుల కోసం వారు మరో పదేండ్లు వేచిచూడాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు భద్రత కల్పించడం లేదని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి ఎలాంటి పరిష్కారం చూపించడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ధనవంతులు ఇంకా ధనవంతులవుతుంటే, పేదవాళ్లు మరింత పేదవాళ్లవుతున్నారని ఆక్షేపించారు.
పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ప్రజల్లోకి వెళ్లేందుకు ‘కింగ్‌’కు ధైర్యం సరిపోవడం లేదన్నారు. గత 15 రోజలుగా తాను పార్లమెంటుకు వస్తున్నానని, అనేక అంశాలు సభలో ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి కేవలం 10 నిమిషాలే సభలో కనిపించారని అన్నారు. చివరగా ‘సత్యమేయ జయతే’ అంటూ ప్రియాంక తన చర్చను ముగించారు.
రాజ్యాంగం ఏకపార్టీ కృషి కాదు : మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లైన సందర్భంగా లోక్‌సభలో జరిగిన ప్రత్యేక చర్చపై ప్రభుత్వం తరపున ఆయన ప్రారంభించారు. ‘భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న ఆమోదించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లైన సందర్భంగా ఈ సభకు, దేశ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవనానికి సంబంధించిన అన్ని కోణాలను స్మృశిస్తూ జాతి నిర్మాణానికి రాజ్యాంగం మార్గం ఏర్పరిచిందని చెప్పగలను. దేశ సమున్నత విలువలకు అనుగుణంగా దేశ ప్రజలు రాజ్యాంగ నిర్మాణం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని మా ప్రభుత్వం సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కాస్‌ విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ స్ఫూర్తితో, భారత రాజ్యాంగంలో రాసిన ధర్మానికి అనుగుణంగా పని చేస్తోంది. ప్రగతిశీల, ఇన్‌క్లూజివ్‌, ట్రాన్స్‌ఫర్మేటివ్‌ రాజ్యాంగం మనది. పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు” అని రాజ్‌నాథ్‌ తన చర్చలో పేర్కొన్నారు.
ప్రమాదంలో ప్రజల హక్కులు : సీపీఐ(ఎం) ఎంపీ ఆర్‌. సచ్చితానందం
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం రాజ్యాంగంపై దాడి జరుగుతోందని సీపీఐ(ఎం) ఎంపీ ఆర్‌.సచ్చితానందం విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతంలో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం లోక్‌సభలో జరిగిన 75 ఏండ్ల రాజ్యాంగంపై చర్చలో సీపీఐ(ఎం) తరపున ఎంపీ సచ్చితానందం మాట్లాడారు. 75 ఏండ్ల రాజ్యాంగం వేడుకను పురస్కరించుకుని సీపీఐ(ఎం) దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతోందని అన్నారు. రాజ్యాంగం దాడిని ఎదుర్కొంటోందని తెలిపారు. దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ప్రధాన కారణమైన లౌకికవాదం, దేశ ప్రజల సమానత్వానికి దిక్సూచి అని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ రెండింటిపై తీవ్ర దాడికి అధికార పార్టీ పూనుకుంటుందని విమర్శించారు. దేశంలో కుల, మత, జాతి, లింగ విక్షవ లేకుండా ప్రజలందరికీ రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చిందని గుర్తు చేశారు. మైనార్టీలకు, సామాజిక అణచివేతకు గురైన దళిత, ఆదివాసీలకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ హక్కులపై దాడి జరుగుతోందని పేర్కొన్నారు.
హిందూత్వ సిద్ధాంతంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏనాడూ ఆమోదించలేదని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్ చాలక్‌ ఎంఎస్‌ గోల్వాల్కర్‌, మరో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత, జనసంఘ్ అధ్యక్షుడు దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారని, ఆర్టికల్స్‌ రాశారని గుర్తు చేశారు. ఆ సిద్ధాంతంతోనే ప్రస్తుతం దేశంలోని మంత్రులు, కీలక పదవుల్లో ఉన్న వారు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో శాస్త్రీయ ఆలోచనను తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని, అందుకే ప్రభుత్వంలో ఉన్నవారు అశాస్త్రీయమైన వ్యాఖ్యలు, చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్రాల గవర్నర్లు సైతం రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనతో ఉన్నారని ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగ సంస్థలు దాడికి గురవుతున్నాయని, న్యాయ వ్యవస్థ, సివిల్‌ సర్వీస్‌, ఆర్మెర్డ్‌ ఫోర్స్‌ వంటి వాటిపై కూడా దాడి జరుగుతోందని విమర్శించారు. దేశ ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని పేర్కొన్నారు.

Spread the love