– జనవరి 31లోపు పంపిణీ
– 1.5 లక్షల మొండిగోడల ఇండ్లను పూర్తి చేస్తాం
– 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు : హన్మకొండ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటిశ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
నాలుగేండ్లలో రాష్ట్రంలో 80 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేస్తామని గృహ నిర్మాణ, రెవెన్యూ, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లో మాదిరిగానే వరంగల్ లోనూ ఎలక్ట్రిక్ బస్సులను నడిపించడానికి నేడు ప్రారంభోత్సవం చేశామని, రెండో విడత సంక్రాంతి లోపు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. దేశంలో టీజీఎస్‌ఆర్టీసీని మోడల్‌గా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 2004-14 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టించినట్టు చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పదేండ్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మిస్తామని చెప్పి కలలు కల్పించిందే తప్ప నిర్మించలేదని విమర్శించారు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వాటిని జనవరి 31లోపు అర్హులైన పేదలందరికీ అందజేస్తామన్నారు. ప్రజాపాలన లో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే ఇంటింటి సర్వే నిర్వహించి 65 లక్షల మంది వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేసినట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్కరూ అభద్రతకు లోనుకావద్దన్నారు. దరఖాస్తు చేసుకోని వారు ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలని, అధికారులు వెంటనే వాటిని యాప్‌లో నమోదు చేస్తారని తెలిపారు. అలాగే, గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలేసిన 1.5 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని తెలిపారు. నిర్మించి వదిలేసిన ఇండ్లను అర్హులకు కేటాయించి, మరమ్మతులకయ్యే ఖర్చును ఆ ఇంటి యజమానికి చెల్లిస్తామని అన్నారు.
జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డులు
ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇవ్వనున్నట్టు మంత్రి చెప్పారు. దేశంలో అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు చెల్లిస్తామన్నారు. వరి పండించే రైతులకు భరోసా కల్పించేలా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా చెల్లిస్తున్నట్టు తెలిపారు. అలాగే, 26వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులను జారీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్వినీరెడ్డి, హౌజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు పి.ప్రావీణ్య, సత్య శారద, కుడా చైర్మెన్ ఇనగాల వెంకట్రామి రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజి వాఖడే తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. వరంగల్ నగరం ప్రత్యేకతను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించి ప్రాధాన్యతని స్తున్నారని, అందులో భాగంగానే మొదటి ఏడాదిలోనే సీఎం రెండుసార్లు నగరాన్ని సందర్శించారని తెలిపారు. మొదటి పర్యటనలో నగరంలో చేయాల్సిన అభివృద్ధిపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకున్నారన్నారు. ఎయిర్‌పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ల నిర్మాణం, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తనకు బాధ్యతలను అప్పగించారని చెప్పారు. రెండోసారి నగరానికి వచ్చిన సందర్భంలో రూ.6,000 కోట్లకుపైగా నిధులను మంజూరు చేశారన్నారు. 2041 మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. భద్రకాళి చెరువు పూడికతీత, వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు టెండర్లు పిలిచినట్టు తెలిపారు.