గడువు ముగిసినా పూర్తికాని బీటీ రోడ్డు నిర్మాణం

– ధర్మారం బల్వంతాపుర్‌ రోడ్డు దుస్థితి పత్తా లేని కాంట్రాక్టర్‌
– పట్టించుకోని అధికారులు
నవ తెలంగాణ- దుబ్బాక
దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మిరుదొడ్డి మండలం ధర్మారం నుంచి దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని దుంపలపల్లి 4, 5 వార్డుల మీదుగా దుబ్బాక మండల పరిధిలోని బల్వంతాపూర్‌ గ్రామం వరకు రూ.4.71 కోట్ల వ్యయంతో ‘ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన’ కింద కేంద్ర నిధులతో ఏడు కిలోమీటర్ల రోడ్డు పనులను చేపట్టారు. గడువు ముగిసినప్పటికీ బీటీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయకుండానే అసంపూర్తిగానే మధ్యలో వదిలేశారు. రోడ్డు టెండర్‌ పట్టుకున్న కాంట్రాక్టర్‌ పత్త్తా లేకుండా పోయారు. 2021లో జిల్లా మంత్రి తన్నీరు హరీశ్‌రావు పనులు ప్రారంభించగా 2023 జూన్‌ లో పనులు పూర్తి కావాలని నిబంధనలు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్‌ అసంపూర్తిగా రోడ్డు నిర్మాణం చేసి మధ్యలోనే ఆపేసాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. దుంపలపల్లి ఐదో వార్డ్‌ చెరువు కట్ట నుండి నాలుగో వార్డ్‌ ఎస్సీ కాలనీ వరకు సుమారు ‘రెండు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు’ నిర్మాణం వేయకుండా మధ్యలోనే పనులను ఆపేశారు. చెరువు కట్ట మత్తడి వద్ద సుమారు 20 మీటర్ల మేర కల్వర్టు నిర్మాణం, ఇతర పనులు చేయకుండా అలాగే రోడ్డు వదిలేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మధ్యలో ఆగిన పనులను వెంటనే పూర్తి చేయించాలని దుంపలపల్లి వాసులు కోరుతున్నారు.

Spread the love