మేడిగడ్డ ఎగువన రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌ నిర్మాణం ?

Construction of Rockfield Dam below Madigadda?– 2.5 మీ.ఎత్తు, 1,632 మీ. వెడల్పు
– అంచనా వ్యయం రూ.50 కోట్లు
– డిజైన్ల తయారీపై ఇంజినీర్ల దష్టి
– తాత్కాలిక సాగునీటి అవసరాలకే
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఆలస్యం అవుతుండటంతో సాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా మేడిగడ్డ ఎగువన రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌ను నిర్మించి సాగునీటి ఇబ్బందులను తాత్కాలికంగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ నిపుణులు మేడిగడ్డ బ్యారేజీ ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎగువ భాగాన రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం డిజైన్లు రూపొందించే పనిలో పడ్డారు. ప్రభుత్వం అనుమతిస్తే నెలరోజుల్లోగా అంటే వర్షాలు తీవ్రమయ్యేలోగా ఈ డ్యామ్‌ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
తాజాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడంతో ఏర్పడిన సాగునీటి సమస్యలను తాత్కాలికంగా రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌ నిర్మాణాలతో పరిష్కరించవచ్చని తెలిసింది. కాళేశ్వరం ఎగువన గోదావరిపై రాక్‌ఫిల్డ్‌ డ్యామ్‌ నిర్మించి నీటిని నిల్వచేసి సాగుభూముల్లో పారించేందుకు నీటిపారుదల శాఖ ప్రయత్నాలు చేస్తున్నది.
భూమి ఉపరితలం పటిష్టంగా ఉండే ప్రాంతంలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఆ నీటిని వ్యవసాయానికి తరలించడమే ఈ డ్యామ్‌ ఉద్దేశం. మొదట డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇనుప స్తంభాలను భూమిలోకి పాతి వాటి ఆధారంగా ఒక ప్రత్యేక తీగల దొంతర తయారు చేసి అందులో రాళ్లు, బంకమట్టి, ఇసుక, కంకర వేసి బలమైన కట్టగా నిర్మించడమే రాక్‌ ఫీల్డ్‌ డ్యామ్‌ ప్రత్యేకత. ఈ బలమైన పట్టు నీటి ప్రవాహ వేగాన్ని కొంతవరకు అడ్డుకోవడం మూలాన అక్కడ నిలిచే నీటిని ఎప్పటికప్పుడు మోటార్లతో తోడి పంటకాలువలకు అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం మేడిగడ్డకు ప్రవాహం వచ్చే ముందు గోదావరిలోని అనువుగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేస్తున్నారు. 2.5 మీటర్ల ఎత్తుతో నది అంచులను తాకుతూ దీనిని నిర్మించనున్నారు. ఎత్తు రెండున్నర మీటర్లు, వెడల్పు 1,632 మీటర్లతో ఈ డ్యామ్‌ నిర్మాణం చేయనున్నారు. అయితే 2.5 మీటర్ల ఎత్తుపైకి నీరు ఎగసి, రాక్‌ ఫీల్డ్‌ డ్యామ్‌ మీద నుంచి దిగువకు ప్రవహించడం మూలాన డ్యామ్‌కు ఎలాంటి నష్టం ఉండదని నీటిపారుదల శాఖ అంచనా వేస్తున్నది. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌ను కట్టి తాత్కాలికంగా మేడిగడ్డపై ఆధారపడిన వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం ఈ డ్యామ్‌ ప్రధాన లక్ష్యం. అయితే మేడిగడ్డ గేట్లు అన్నీ ఎత్తి ఉంచాలని నేషనల్‌ డ్యాంసేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) తన మధ్యంతర నివేదికలో చెప్పడంతో ఇప్పటికే మొరాయిస్తున్న గేట్లను తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా మేడిగడ్డ ఎగువన ఈ డ్యామ్‌ నిర్మించనున్నారు. ఈ డ్యామ్‌తో నిరంతరం అవసరం మేరకు నీటిని తోడుకునే అవకాశాలుంటాయని ఇంజినీరింగ్‌ నిపుణులు భావిస్తున్నారు..
ఈ డ్యామ్‌ నిర్మాణానికి అందుబాటులో ఉన్న నిర్మాణ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి పనులు అప్పగించాలని నీటిపారుదల శాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. అయితే వర్షాకాలంలోగా డ్యామ్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కాపర్‌ డ్యామ్‌పై నీటిపారుదల శాఖ దష్టి సారించింది. కాగా కాపర్‌ డ్యామ్‌కు రాక్‌ఫిల్డ్‌ డ్యామ్‌కు ఎలాంటి సంబంధంలేదు. ప్రాచీనకాలంలో ఈతరహా డ్యామ్‌లు కనిపిస్తాయని ఇంజినీర్లు అంటున్నారు. ఇనుము(స్టీల్‌) అందుబాటులోకి రాక మునుపు భారీ కర్రలను భూమిలోకి పాతి బండరాళ్లు, బంకమట్టితో కట్టలు నిర్మించినట్టు సమాచారం. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సైనికులు నదులపై రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌లు నిర్మించి నీటి అవసరాలను తీర్చుకున్నారని అంటున్నారు. ఇప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో తమ నీటి అవసరాల కోసం సైనికులు రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌లు ఏర్పాటు చేసుకుంటారని తెలిసింది. దేశంలో శాతవాహనుల కాలం నుంచి ఇలాంటి డ్యామ్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలో ఆస్ఫిరియన్లు, బాబిలోనియన్లు, పర్షియన్లు నీటిసరఫరా కోసం ఇలాంటి డ్యామ్‌లను క్రీ.పూ.750 నుంచి 250 మధ్య కాలంలో నిర్మించినట్టు చరిత్రలో ఉంది. 15 మీటర్ల ఎత్తు 600 మీటర్ల పొడవుతో నిరించిన రాక్‌ఫీల్డ్‌ డ్యామ్‌లు కూడా ఉన్నట్టు చరిత్రకారులు చెబుతుంటారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువన కూడా రాక్‌ఫిల్డ్‌ డ్యామ్‌లు కట్టాలనే భావనతో ఉన్నారు. ఈమేరకు గత క్యాబినెట్‌లోనూ చర్చించినట్టు తెలిసింది.

Spread the love