సమకాలీనం!

సమకాలీనం!బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, స్వయంగా చెప్పిన మాటలనే మళ్ళీ అనలేదని రాజకీయ నాయకులు ఎందుకు అంత ధైర్యంగా అబద్ధాలు చెబుతారు!!
వాహనాలకు నాలుగైదు అంకెల కంటే పెద్ద నెంబరు ఎందుకు ఉండదు?
షషష
రాత్రి ఎనిమిది గంటల సమయం. జాతీయరహదారి 65 పై ఒక మాదిరి పట్టణం అది. రహదారి సరిగ్గా పట్టణం మధ్యలో నుండి వెళుతుంది. మెయిన్‌ రోడ్డు అనబడే ఆ రోడ్డుపై వాహనాల రొద. ఎవ్వరిని చూసినా ఏదో పనున్నట్టు హడావుడిగా వెళ్తున్నారు. క్షణం ఆగితే ప్రళయం వచ్చి రోడ్డు మీదనే ఆగిపోయే ప్రమాదం ఉందేమో అన్న భయంతో పరుగులు తీస్తున్నట్టు కనపడుతున్నారు.
బస్టాండ్‌కి దగ్గరలో ఉన్న నాగార్జున లాడ్జిలో అడుగుపెట్టాడు అతను మిత్రునితో కలిసి.
ఇద్దరూ రిసెప్షన్‌ దగ్గరకి వెళ్లారు. పెద్దగా పనిలేదని తెలియచేసే ముఖకవళికలతో రిసెప్షనిస్ట్‌ కూచుని ఉన్నాడు.
”గది కావాలి?” అడిగారు.
”ఎన్ని రోజులకు?”
”ఇవ్వాల్టినుండి ఐదు రోజులు. కానీ రశీదు మాత్రం రేపు సాయంత్రం నుండి కావాలి. ఆఫీసులో సబ్మిట్‌ చేయాలి. కావాలంటే ఈ రోజు గది కిరాయి నువ్వు తీసుకో!”
రిసెప్షనిస్ట్‌ సందేహంగా చూశాడు.
”నీ ఇష్టం. వీలు పడదంటే వేరే చోట చూస్తాం”
చూస్తూ చూస్తూ కస్టమర్‌ని వదిలేయడం ఇష్టం లేదు. పైగా ఇలా రకరకాల రిక్వైర్‌ మెంట్స్‌తో బిల్లులు అడగడం మామూలే అతనికి. కస్టమర్‌ల సంఖ్యకు, అతని జీతానికి, అదాయానికీ… ఇతరులకి కనపడని లంకె ఉంది మరి.
”సరే.. ఈ రోజు కిరాయి ముందు ఇవ్వండి. రీసిప్ట్‌ ఇవ్వను. ఉండబోయే రోజులకు అడ్వాన్స్‌ ఇవ్వండి.”
”ఇంకో మాట. విపరీతంగా పని ఒత్తిడితో ఉన్నాం. సరిగా నిద్ర లేక చాలా రోజులయింది. ఇంకా చెప్పాలంటే కరువైన నిద్రని పొందడానికే వచ్చాం. రూం క్లీనింగ్‌ లాంటివి అవసరమైతే మేమే చెప్తాం. బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌ ప్రతిదీ సమయానికి పంపించండి. కానీ డోర్‌ ఒక సారి నాక్‌ చేసి తలుపు ముందు పెట్టిపోతే చాలు. తింటే తింటాం లేకపోతే లేదు. బిల్‌ ఇస్తాం”
”అలాగే” ఇంటి దగ్గర ఎలా ఉన్నా ఇల్లాంటి చోట మహారాజుల్లాగా హుందాతనం ప్రదర్శించేవారూ అతనికి కొత్తగాదు.
షషష
అర్థరాత్రి! తప్పుడు పనులు శ్రద్దగా చేసే సమయం!!
ఇద్దరూ గదిలోనుండి బయటకు వచ్చారు. అతను బ్యాక్‌ బ్యాగ్‌తో… వెనుక మిత్రుడు.
ఓ రెండు వందల మీటర్ల దూరంలో ఓ జాతీయ బ్యాంక్‌ ఎటిఎం.
కొన్ని అడుగుల దూరంలో ఉండగానే… మంకీ క్యాప్‌, చేతికి గ్లౌస్‌ ధరించారు.
ఏటిఎంలోకి వెళ్లగానే చేతిలో ఉన్న పౌడర్డ్‌ క్లాత్‌ని సిసి కెమేరాపై విసిరాడు. మిత్రుడు బయటే నిలబడ్డాడు.
అతను లోపల జస్ట్‌ ఇరవై ఏడు నిమిషాలు ఉన్నాడు. తరువాత బయటికి వచ్చాడు. ఇప్పుడతని బ్యాగ్‌లో ముప్పైఆరు లక్షల రూపాయలు పైన కొంత… ఉన్నాయి. పెద్ద నోట్లు కారణంగా అంత సొమ్ము ఉన్నా అతని బ్యాగ్‌ నిండలేదు.
నేరుగా లాడ్జికి వచ్చారు. అంతా కలిపి నలభైరెండు నిమిషాలు. రిసెప్షనిస్ట్‌ నిద్రలోనే ఉన్నాడు. అప్పటికే బ్యాగ్‌లో ఉన్న మెక్‌ డోల్‌ విస్కీ బాటిల్‌ చేత్తో తీసి పట్టుకున్నారు, ఎవరైనా అడిగితే ముందు జాగ్రత్తకోసం… గదిలోకి వచ్చి కూలబడ్డారు.
ఇదంతా మిత్రునికి కొత్త. అతనికి అయోమయంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఉంది. నేరం చేసినచోటనే ఉండటానికి ధైర్యం సరిపోవడం లేదు. అతను మాత్రం ఇదేమీ పట్టనట్టు బెడ్‌ పై వాలిపోయాడు.
షషష
ఉదయం లేచేసరికి ఏడు గంటలు దాటింది.
రాత్రంతా నిద్ర సరిగా లేదని మిత్రుని కళ్ళు చెబుతున్నాయి. అతను రూంలో ఉన్న టీవీ ఆన్‌ చేశాడు. లోకల్‌ ఛానల్‌లో వార్త ప్రసారమవుతోంది. క్లిప్పింగ్స్‌లో పోలీసులు నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న దశ్యాలు.
సినిమాల్లో చూసినట్టు ప్రతీచోటా జాగిలాలు రావని అతనికి తెలుసు. కానీ అతని మిత్రుడికి తెలియదు. డోర్‌ మీద ఒక నాక్‌ వినిపించింది. బ్రేక్‌ ఫాస్ట్‌…
రూం బోరు వెళ్లిన తరువాత దాన్ని రూంలోకి తెచ్చుకొని, పూర్తి చేసి మళ్ళీ బయట పెట్టేశారు.
మధ్యాహ్నానికి సిసి కెమేరాల్లో వీరి ఆనవాళ్ల గురించిన దశ్యాలు ప్రసారమవుతున్నాయి.
అవి చూసి ‘అర్రే… ఇది ఎలా జరిగింది? బహూశా ఏటిఎంలో ఎంటరవగానే రికార్డయిన క్లిప్పింగ్‌ కావచ్చు’ అనుకున్నాడతను. మిత్రుడికి బీపీ పెరిగిపోతోంది.
ఇంకాసేపటికి వీరిని పోలిన పెన్సిల్‌ చిత్రాలు కూడా ప్రసారం కాసాగాయి.
ఆ చిత్రాలన్నింటిలోనూ మాస్కులు, గ్లౌస్‌లే!
”అతను మాత్రం లంచ్‌ కి ఏం పంపమని చెబుదాం?” అడుగుతున్నాడు.
టీవీ వాళ్లు మాత్రం నేరస్తులు ఎంత వేగంతో పోతే, ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది అనేది యానిమేటెడ్‌ వీడియోస్‌ లాగా చూపిస్తున్నారు. మరో రోజు గడిచింది. ఇంకాస్త వివరంగా యానిమేషన్‌ వీడియోలు. నేరస్తులు ఏ ప్రాంతం వారై ఉండే అవకాశం ఉంది? పాత నేరస్తులలో దొంగతనం చేసిన విధానం ఎవరితో పోలి ఉంది? వగైరా !!
పోలీసులు టౌన్‌లో ఉన్న అన్ని లాడ్జీలు తనిఖీ జరుపుతున్నట్లు వార్తలు చెబుతున్నాయి. నేరం జరిగిన రోజు, ముందు రోజు ఎవరెవరు లాడ్జీల్లో దిగారు? వారి అడ్రస్‌లు తెలుసుకుంటున్నారు. అతను అనుకున్నట్లుగానే పోలీసులు వీళ్లున్న లాడ్జికి వచ్చి రికార్డ్‌లు చెక్‌ చేసి వెళ్లారు.
నాలుగో నాటికి సద్దు మణిగింది. ఇన్ని రోజుల్లో వారిద్దరి మధ్య పెద్దగా సంభాషణలు జరగలేదు.
టీవీల్లో ఎవరో రాజకీయనాయకుడు అన్న ఒక మాటపై చర్చోపచర్చలు, వాదోపవాదాలు నడుస్తున్నాయి. మూడు రోజులకింద ఒక నేరం జరిగిన సంగతి కూడా ఎవరికీ గుర్తున్నట్టు లేదు.
ఇంకో చానల్‌లో మూడు నాలుగేళ్ల పాప ఒళ్ళంతా విపరీతంగా తిప్పుతూ రీసెంట్‌గా వైరల్‌ అయిన ఓ సినిమాలోని పాటకు నత్యం చేస్తోంది. మాటి మాటికి వచ్చే కొత్త సినిమాల ప్రకటనలు, చర్మం రంగు మార్చే క్రీముల ప్రకటనలు…. అంతా మామూలుగా, బహు మామూలుగా కనపడుతోంది.
అయిదవ రోజు అతను వెళ్లిపోదామన్నాడు.
”ఇప్పుడా? ఎవరైనా గుర్తుపడితే?”… మిత్రుని గుండె దడదడ లాడింది. కానీ ఆ మాట బయటికి అనలేదు… లోపల అనుకున్నాడు.
ఉదయం పది గంటలకు రూంలో నుండి బయటికి వచ్చారు. రిసెప్షనిస్ట్‌ దగ్గరికి వచ్చాడు. వెనుకనే అతని మిత్రుడు. రిసెప్షనిస్ట్‌ నమస్కారానికి ప్రతినమస్కారం చేసి, బిల్‌ క్లియర్‌ చేసి అదనంగా కొంత ఇచ్చి లాడ్జి బయటికి వచ్చారు. అతను నింపాదిగా నడుస్తున్నాడు. వెనుక మిత్రుడు హడిలిపోతూ. బస్టాండ్‌ చేరుకున్నారు. ఎవ్వరూ అనుమానించలేదు.
సమాజంలోని జనాల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ప్రాధామ్యాల గురించి అతని అంచనా ఎప్పుడూ తప్పలేదు. బస్‌ స్టాండ్‌లో ఉన్న టీవీలో స్క్రోలింగ్‌ వస్తోంది. పోలీసులు దోపిడీ చేసిన వారిని పట్టుకున్నారు. త్వరలో వారు దాచిన సొమ్ముని రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అతని మిత్రుడు బిత్తరపోయి చూస్తూ…. ”అదేమిటీ?” అన్నాడు.
నవ్వుతూ… మిత్రుని చేయి పట్టుకొని లాగుతూ అక్కడున్న బస్‌ ఎక్కేశాడు అతను.
పోలీసులు ఎలాగైనా… కేసు పరిష్కరిస్తారు. వారు బస్సు దిగేసరికి ఏమైనా జరగొచ్చు. ఎప్పటికీ ఏమీ జరగకపోవచ్చు.
బస్‌లో కూచున్న అతనికి ఉన్నట్టుండి ఓ ఊహ తట్టింది. జనాలు వారికి ఉండి తీరాల్సిన తెలివిడితో, చైతన్యంతో ప్రవర్తిస్తే ఇది తప్ప వేరే పని చేయలేని తనలాంటి వారికీ, నాయకులకీ బతుకు తెరువు ఏమిటా అని!!
– బాడిశ హన్మంతరావు, 9908486615

Spread the love