– ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రొ. జి.మల్లేష్
– ఓయూలో మహాధర్నా
– పాల్గొన్న అన్ని యూనివర్సిటీల కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్
నవతెలంగాణ-ఓయూ
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ జి.మల్లేష్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూలో శనివారం తలపెట్టిన మహాధర్నా విజయవంతమైంది. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారి బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తమను రెగ్యులరైజేషన్ చేసేందుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మహాధర్నాకు ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రొ. జి.మల్లేష్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓయూలో ఎన్నో సంవత్సరాలుగా బోధన, పరిశోధన, పరిపాలన విధుల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వారిని రెగ్యులర్ చేయాలని తమ అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా యూనివర్సిటీలను బలోపేతం చేయొచ్చని తెలిపారు. ఓయూ మ్యాథమెటిక్స్ హెడ్ ప్రొ. కిషన్ మాట్లాడుతూ.. రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీతో సమానంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని వివరించారు. యూనివర్సిటీలలో పెద్దఎత్తున ఖాళీలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పీడీఎస్‌యూ రాష్ట్ర విద్యార్థి నాయకులు ఎస్.నాగేశ్వరరావు మాట్లా డుతూ.. అన్ని అర్హతలతో ఎన్నో ఏండ్లుగా యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఉదరు మాట్లాడుతూ.. యూనివర్సిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదన్నారు. ఓయూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరందన్నారు. ఓయూ బీసీసెల్ డైరెక్టర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ రాష్ట్ర చైర్మెన్ డాక్టర్ ఏ.పరశురాం, వర్కింగ్ చైర్మెన్ డాక్టర్ డి.ధర్మతేజ, కో చైర్మెన్ డాక్టర్ రాందాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. మహాధర్నా అనంతరం ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ తమను రెగ్యులరైజ్ చేయాలని మరోమారు వారు విజ్ఞప్తి చేశారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దునుకు వేలాద్రి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ కాకతీయ యూనివర్సిటీ నాయకులు డాక్టర్ కరుణాకర్ రావు, డాక్టర్ బైరి నిరంజన్, డాక్టర్ రాజేష్, తెలంగాణ యూనివర్సిటీ నాయకులు డాక్టర్ దత్త హరి, డాక్టర్ నారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.