– ఢిల్లీలో విద్యుత్‌శాఖ మంత్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల విద్యుత్‌శాఖల మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్‌లాల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని విద్యుత్‌రంగ స్థితిగతులు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు తొలిప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. దీనికోసం కేంద్రం నుంచి పలు రాయితీలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటీవల విదేశాల్లో పర్యటించి వచ్చిన అంశాలు, సాంకేతికత విషయాలను వివరించారు. డిప్యూటీ సీఎం వెంట ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తదితరులు ఉన్నారు.