– అదనంగా ఐపీఎస్‌లను ఇవ్వండి
– ఏపీ నుంచి బకాయిలు ఇప్పించండి
– యాంటీ నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి నిధులు ఇవ్వండి
– కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
– హైదరాబాద్ మెట్రో రెండో దశ, మూసీ రివర్‌ఫ్రంట్‌పై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురీతో భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షాను ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, న్యూఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను పూర్తి చేయాలని, చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడంపై దృష్టి సారించాలని కేంద్ర హోం శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్‌హెచ్‌ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలని కేంద్ర హౌం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి
హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజప్తి చేశారు. కేంద్ర మంత్రిని గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో రెండో దశను (బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్‌బీ నగర్, 26 కిలో మీటర్ల మేర రూ.9,100 కోట్ల అంచనా వ్యయం, విమానాశ్రయం మెట్రో కారిడార్- రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలో మీటర్ల మేర, రూ.6,250 కోట్ల అంచనా వ్యయం) సవరించాల్సి ఉందని తెలిపారు. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిగణించాలని కోరారు. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నట్టు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని, అవసరమైన మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రి పురీని కోరారు. రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాటిని ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు ఇండ్లు మంజూరు చేయడంతో పాటు ఇవ్వాల్సిన బ్యాలెన్సు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.