– జేపీసీలో టీఎంసీ ఎంపీ, ప్రతిపక్ష నేతల నిలదీత
– గ్లాస్ పగులగొట్టిన టీఎంసీ సభ్యుడువేళ్లకు గాయం
– ఆయనపై ఒకరోజు సస్పెన్షన్ వేటు బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయతో, కళ్యాణ్ బెనర్జీ ఘర్షణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీి) సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుచిత ప్రవర్తనకు పాల్పడటంతో ఆయనను కమిటీ నుంచి ఒక రోజు సస్పెండ్ చేశారు. వక్ఫ్ (సవరణ) బిల్లు-2024పై బీజేపీ నేత జగదాంబిక పాల్ అధ్యక్షతన మంగళవారం నాడు పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్‌లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశమైంది. ఒడిశా-కటక్‌కు చెందిన జస్టిస్ ఇన్ రియాలిటీ, పంచశాఖ ప్రచార్ ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించేందుకు కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, లాయర్లు తమ అభిప్రాయాలు చెబుతుండగా, బిల్లుకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు నిలదీశారు. కళ్యాణ్ బెనర్జీ అభ్యర్థనను జేపీసీ చైర్మెన్, బీజేపీ లోక్‌సభ ఎంపీ జగదాంబిక పాల్ తిరస్కరించారు. ఆయన మాత్రం తనను మాట్లాడేందుకు అనుమతించాలని పట్టుబట్టారు. దీనిపై బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు. బెనర్జీ పదే పదే మాట్లాడాలని డిమాండ్ చేయడంపై బీజేపీకి చెందిన అభిజిత్ గంగోపాధ్యారు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గంగోపాధ్యాయ, బెనర్జీ ఇద్దరూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. దీంతో బెనర్జీ కోపంతో అక్కడున్న గ్లాస్ వాటర్ బాటిల్‌ను విసిరేశారు. దీంతో ఆయన బొటనవేలు, చూపుడువేలుకు గాయమైంది. వెంటనే కళ్యాణ్ బెనర్జీని ప్రథమ చికిత్స కోసం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆప్ నేత సంజరు సింగ్ బయటకు తీసుకువచ్చారు. దీంతో సమావేశం కాసేపు వాయిదా పడింది.
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రతిపాదన పెట్టగా, తొమ్మిది మంది సభ్యులు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. మరో ఎనిమిది మంది ప్రతిపాదనను వ్యతిరేకించారు. గంగోపాధ్యాయతో సహా కొంతమంది బీజేపీ ఎంపీలు బెనర్జీని జేపీసీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే ఆయనపై ఒక్కరోజు సస్పెండ్ వేటు వేశారు. పగిలిన అద్దాన్ని విసిరే ప్రయత్నంలో తన చేయి కోసుకుందని బెనర్జీ పేర్కొనగా, చైర్మెన్ వైపు గాజు గ్లాస్‌ను విసిరినట్టు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వక్ఫ్ సవరణ బిల్లును అధికార పార్టీ తీసుకువచ్చినట్టు ఆయన ఆరోపించారు. ముస్లిం వర్గాన్ని ఆ బిల్లుతో టార్గెట్ చేసినట్ట్ల పేర్కొన్నారు. ఆ సమయంలో బీజేపీ నేతలు ఆ బిల్లును సమర్థించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ విషయంలో సంస్కరణలు అవసరం అన్నారు. డిజిటలైజేషన్, ఆడిటింగ్, లీగల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం ఉంటుందని బీజేపీ సభ్యులు వాదించారు. వక్ఫ్ బిల్లు సవరణపై ఇప్పటి వరకు జేపీసీ కేవలం ఢిల్లీలోనే 15 సమావేశాలు నిర్వహించింది. మరో ఐదు సమావేశాలను ఇతర నగరాల్లో ఏర్పాటు చేసింది.