చెయ్యని నేరానికి పడిన శిక్ష.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా రిలీజ్

నవతెలంగాణ- మీరట్: అతడో రైతు బిడ్డ. పన్నెండేండ్ల కింద 18 ఏండ్ల వయసులో చెయ్యని నేరం మీద పడింది. ఇద్దరు కానిస్టేబుళ్లను చంపినట్లు కోర్టు తేల్చి కటకటాలకు పంపింది. దీంతో ఆర్మీలో చేరాలన్న ఆ యువకుడి కల చెదిరిపోయింది. అయినా, అతడు పట్టు విడవలేదు. రెండేండ్ల తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చి.. లా చదివాడు. తన కేసు తానే వాదించుకొని నిర్దోషిగా విడుదలయ్యాడు.    మీరట్ పరిధి బాగ్‌‌పత్‌‌లోని కిర్తల్ గ్రామానికి చెందిన ఒక రైతు కొడుకు అమిత్ చౌదరి. 2011లో ఇద్దరు కానిస్టేబుళ్లను కైల్  ముఠా సభ్యులు హత్య చేశారు. ఈ కేసులో చౌదరి ఇరుక్కున్నాడు. మృతులు ఇద్దరు పోలీసులు కావడంతో కేసును వెంటనే తేల్చాలని అప్పటి సీఎం మాయావతి ఆదేశించారు. దీంతో మర్డర్​ వెనకున్న కైల్ గ్యాంగ్​లోని సభ్యులందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజానికి మర్డర్ జరిగిన సమయంలో చౌదరి స్పాట్​లో లేకపోయినప్పటికీ కైల్ గ్యాంగ్​ సభ్యులలో ఒకడిగా పేర్కొంటూ అమిత్ చౌదరి పేరును అందులో చేర్చారు. దీంతో జైలు శిక్ష పడింది. 2013లో బెయిల్​మీద విడుదలైన అమిత్ చౌదరి.. డిగ్రీ, ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎమ్ పూర్తి చేశాడు. బార్ కౌన్సిల్​లో మెంబర్ షిప్ సాధించాడు. తన కేసును తానే వాదించుకున్నాడు. తనను అరెస్ట్ చేసిన పోలీసులనే బోనులో నిలబెట్టి తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టులో నిరూపించుకున్నాడు. తనతో పాటు ఈ కేసులో ఇరుక్కున్న మరో 13 మంది నిందితులను కూడా కోర్టు ఇటీవలే నిర్దోషులుగా విడుదల చేసింది. అసలు నేరస్థులైన ముగ్గురిలో గ్యాంగ్​స్టర్ కైల్​ పోలీసుల ఎన్​కౌంటర్​లో చనిపోగా, ఒకరు క్యాన్సర్​తో మరణించారు. మూడో వ్యక్తి జీవిత ఖైదుగా ఉన్నాడు. తాను క్రిమినల్ జస్టిస్​లో పీహెచ్​డీ చేయనున్నట్లు చౌదరి చెప్పారు.

Spread the love