పెంచిన వేతనాలకు బడ్జెట్‌ ఇవ్వకపోతే పాఠశాలల్లో వంట బంద్‌

– ప్రగతిభవన్‌నూ ముట్టడిస్తాం
– ధర్నాచౌక్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల భారీ ధర్నా
– రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది రాక
– మీ జీతాలు పెంచుకుంటారు..మా సంగతేంటి ?: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఆగ్రహం
– ఎర్రజెండాలు స్వార్థ రాజకీయాలు చేయవు:జె.వెంకటేశ్‌ స్పష్టీకరణ
– వేతనాలివ్వకపోతే గంటెలు మడతేయాలి:ఎస్‌ వి రమ పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలకు బడ్జెట్‌ కేటాయించి వెంటనే నిధులివ్వకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో వంటను బంద్‌ చేస్తామని మధ్యాహ్న భోజన కార్మికులు హెచ్ఛరించారు. అవసరమైతే ప్రగతిభవన్‌నూ ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాధ్‌లోని ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఆందోళన ద్వారా అల్టిమేటమ్‌ ఇచ్చారు. ఏండ్ల తరబడి తమ కష్టాలు, బాధలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మధ్యాహ్నా భోజన కార్మికుల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా హాజరయ్యారు. దాదాపు అన్ని
జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌కు చేరుకున్నారు. ధర్నా కోసం మంగళవారం రాత్రే హైదరాబాద్‌కు వచ్చారు. బస్సులు, లారీలు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు. మధ్యాహ్నాం 12 గంటలకు ప్రారంభమైన ధర్నా, సాయంత్రం నాలుగు గంటల వరకు సాగించిది. ధర్నా ప్రాంగణంతోపాటు చుటుపక్కల మొత్తం మధ్యాహ్నా భోజనం కార్మికులతో ఇందిరాపార్క్‌ నిండిపోయింది. ఎక్కడా చూసినా వారే కనిపించారు. పిల్లలను ఎత్తుకుని ఆందోళనలో పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వేతనాల పెంపును అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల నినాదాలతో ధర్నాచౌక్‌ దద్ధరిల్లింది. వచ్చిన కార్మికులకు టెంట్‌ చాలకపోవడంతో మూడు, నాలుగు చోట్ల కూర్చుని ధర్నాలో పాల్గొన్నారు. పెంచిన వేతనాలకు బడ్జెట్‌ ఇవ్వాలి, మెనూ ఛార్జీలను చెల్లించాలి అంటూ నినాదాలు చేశారు. సీఎం హామీలను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని ధర్నా సందర్భంగా కార్మికులు వ్యాఖ్యానించడం గమనార్హం. నినాదాలతోపాటు ప్లకార్డులు ప్రదర్శించారు. జెండాలను పట్టుకుని ఒక పూట సాంతం ఆందోళనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘం ఉప్యాక్షురాలు సుల్తానా అధ్యత వహించగా, సీఐటీయూ ఉపాధ్యక్షులు ఈశ్వర్‌రావు, యూనియన్‌ ఆఫీసు బేరర్లు ఇందూరి సులోచన, రాజేశ్వరి, మాయ, సరస్వతి, స్వప్న, సత్యనారాయణ, సీఐటీయూ నాయకులు గోవర్థన్‌, రంజీత్‌, కృష్ణామాచారి, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
సీఎం హామీ అమలుచేయాలి: పాలడుగు భాస్కర్‌
మధ్యాహ్నా భోజన కార్మికులకు అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీలు అమలుచేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ధర్నాను ప్రారంభించి మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీతాలు పెంచుకుంటే సరిపోదనీ, పిల్లల కడుపులు నింపుతున్న మధ్యాహ్నా భోజన కార్మికుల బతుకుల్లోకి తొంగిచూడాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాగితాల్లో కాకుండా ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు. సమస్యలపై ప్రభుత్వాలు హామీలు ఇస్తూ కాలం గడుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు అప్రమత్తంగా ఉంటూ అడుగడుగునా పోరాటం చేయాల్సిందేనని చెప్పారు. కనీస పౌష్టికాహారం లేక కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తు చేశారు. ఏరియర్లతో కలుపుకుని వేతనాలు చెల్లించాలని సర్కారుకు విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుతం 24 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు కోడ్‌లు తెచ్చిందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ స్కీం వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోలీసు, మిలిటరీ, లాఠీఛార్జీకి బెదిరేదిలేదని చెప్పారు.
15 రోజుల్లో పరిష్కరించాలని :జె.వెంకటేశ్‌
మధ్యాహ్నా భోజనం కార్మికుల సమస్యలను 15 రోజుల్లో యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. వారి న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఎర్ర జెండాలు స్వార్థ రాజకీయాలు చేయవనీ, ప్రజాసమస్యలపై పోరాటాలు మాత్రమే చేస్తామని అన్నారు. మంత్రి హరీశ్‌రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయన అవాకులు చేవాకులు పేలుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ నీకు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన మొనగాడు సంఘం సీఐటీయూ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
బంగారు తెలంగాణలో ఆడపడుచుల కంటనీరు:ఎస్‌వి రమ
సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణలో ఆడపడుచుల కంటనీరు ప్రవహిస్తున్నదని తెలంగాణ మధ్యాహ్నా భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్‌.వి రమ డిమాండ్‌ చేశారు.ధరలకు అనుగుణంగా మధ్యాహ్నా భోజనం కార్మికుల వేతనాలు పెంచడం లేదన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించక అప్పుల పాలవుతున్నారని గుర్తు చేశారు. అధికారంపై ఉన్న మక్కువ ప్రజలు, కార్మికులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీని ఎత్తేసింది, ఇప్పుడేమో కట్టెలపొయ్యిపై వంట చేయకుండా అడ్డుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు పెట్టుబడి పెట్టినా లాభం లేదన్నారు. సొంతరాష్ట్రంలో అడుక్కునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. జీతాలు ఇవ్వకపోతే గంటెలు మడతేయాలని పిలుపునిచ్చారు.

Spread the love