మే నెల రాకముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలా కాసేపు బయటికి వెళ్లినా ఒంట్లోని శక్తి మొత్తం ఎవరో స్ట్రా వేసి పీల్చినట్లే అనిపిస్తుంది. ఇక వేసవి తాపం కారణంగా డీహైడ్రేషన్, వడ దెబ్బ, అతిసారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇలా వేసవితో ముడిపడి ఉండే ఇటువంటి సమస్యలకు బార్లీ, మజ్జిగతో చెక్ పెట్టొచ్చు. అలాగే ఈ వేడిని తట్టుకోలేక పిల్లలు ఎక్కువగా ఐస్‌క్రీం అడుగుతుంటారు. అలాంటప్పుడు ఇంట్లోనే ఆరోగ్యకరంగా ఐస్‌క్రీం కూడా చేసి పెట్టొచ్చు.
బార్లీ జావ
ఉపయోగాలు: బార్లీలో శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కాల్షియం, ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యం, అజీర్తి, డీహైడ్రేషన్, డయాబెటిస్ కంట్రోల్‌తో పాటు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
కావాల్సిన పదార్థాలు: బార్లీ – ఒకటిన్నర గ్లాసు, నీళ్లు – 3 గ్లాసులు, ఉప్పు – రుచికి సరిపడా, పెరుగు – గ్లాసు, పచ్చిమిర్చి – 4, క్యారెట్ తురుము – కొద్దిగా, అల్లం – చిన్న ముక్క, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నూనె – అర చెంచా, ఆవాలు – అర చెంచా, జీలకర్ర – అర చెంచా, ఇంగువ – చిటికెడు.
తయారీ విధానం: ముందుగా కుక్కర్‌లోకి బార్లీ తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక గ్లాసుకు బార్లీకి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అంటే ఇక్కడ గ్లాసున్నర కాబట్టి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ సగ భాగాన్ని సన్నగా తురుముకుని పక్కన ఉంచాలి. బార్లీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత ఉడికించిన బార్లీని మిక్సీజార్‌లోకి తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం కాస్త గట్టిగా అనిపిస్తే రుబ్బుకునేటప్పుడు కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. బార్లీని గ్రైండ్ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి పెరుగు, మరో గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము వేసి మిక్స్ చేసుకుని పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత ఇంగువ వేసి మగ్గించాలి. చివరగా పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి ఓ నిమిషం వేపి బార్లీలో కలుపుకోవాలి. తాలింపును బార్లీలో కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎండాకాలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బార్లీ జావ రెడీ.
టిప్స్: బార్లీ గింజలను రాత్రంతా నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి. జావను తయారుచేసేటప్పుడు గింజలు పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి. జావను మరింత రుచికరంగా చేయడానికి నిమ్మరసం, పండ్ల ముక్కలు కూడా కలుపుకోవచ్చు.
కరివేపాకు మజ్జిగ
కావల్సిన పదార్థాలు: కరివేపాకు – గుప్పెడు, ఉప్పు – అరటీస్పూన్, జీలకర్ర పొడి – అరటీస్పూన్, అల్లం – అర అంగుళం ముక్క, పెరుగు – కప్పు.
తయారు చేసే విధానం: ముందుగా తాజా కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న కరివేపాకును కాడల నుంచి దూసి వేసుకోవాలి. అందులో ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం, పెరుగు, తగినన్ని నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమం చిక్కగా ఉందనిపిస్తే మరికొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. అనంతరం గ్లాసులలో పోసుకొని చివర్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే ఎంతో రుచికరంగా ఉండే హెల్దీ ‘కరివేపాకు బటర్ మిల్క్’ మీ ముందు ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు: కరివేపాకులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, పీచు పోషకాలతో పాటు విటమిన్-సి, విటమిన్-బి, విటమిన్-ఇలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా కరివేపాకులో విటమిన్-ఎ అధికంగా ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. అలాగే దీనిలో చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా, అందంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. కాబట్టి జుట్టు ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారూ కరివేపాకు తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ‘కార్బజోల్ ఆల్కలాయిడ్స్’ బరువు నియంత్రణలో ఎంతగానో సహాయ పడుతుంది. ఇంకా శరీరంలోని వ్యర్థాల్నీ బయటకు పంపిస్తూ, జీర్ణశక్తిని పెంచడంలోనూ కరివే పాకు ముందు వరుసలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సబ్జా క్యాండీ ఐస్‌క్రీమ్
కావాల్సిన పదార్థాలు: సబ్జా గింజలు – అర టీ స్పూన్, పటిక బెల్లం – అర కప్పు, నిమ్మకాయ – 1, ఉప్పు – చిటికెడు, వాటర్ – పావు లీటర్, పుదీనా ఆకులు – కొద్దిగా
తయారీ విధానం: ఓ బౌల్‌లోకి సబ్జా గింజలు తీసుకోవాలి. అందులో అర కప్పు నీళ్లు పోసుకుని సుమారు అర గంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మిక్సీజార్‌లోకి పటిక బెల్లం తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. సబ్జా గింజలు నానిన తర్వాత మిగిలిన ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పటిక బెల్లం పొడి, నిమ్మరసం, ఉప్పు, నానబెట్టిన సబ్జా గింజలు, వాటర్, సన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసి బాగా మిక్స్ చేసుకుని ఓ 10 నిమిషాలు పక్కన ఉంచాలి. పది నిమిషాల తర్వాత ఐస్‌క్రీమ్ మౌల్డ్స్ తీసుకుని ఈ వాటర్‌ను వాటిలో పోసి అల్యూమినియం పాయిల్‌తో క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్‌క్రీమ్ మౌల్డ్ లేకపోతే చిన్న చిన్న స్టీల్ గ్లాసులలో కూడా వీటిని పోసి పేపర్ చుట్టేసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. తర్వాత ఆ వాటర్‌లోకి ఐస్‌క్రీమ్ పుల్లలు గుచ్చి సుమారు 6 గంటలు లేదా రాత్రంతా ఫ్రీజర్‌లో పెట్టాలి. ఐస్‌క్రీమ్ తయారైన తర్వాత ఫ్రిజ్ నుంచి బయటికి తీసి ఓ నిమిషం తర్వాత డీమౌల్డ్ చేస్తే పుల్లగా, తియ్యగా ఉండే సబ్జా క్యాండీ ఐస్ రెడీ.
టిప్స్: పటిక బెల్లం ప్లేస్‌లో పంచదార లేదా తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నీళ్లకు బదులు ఇతర పండ్ల జ్యూస్‌లు ఉపయోగించినా టేస్ట్ మరింత బాగుంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం చిన్నగా కట్ చేసి స్ట్రాబెర్రీ, చెర్రీ ముక్కలను కూడా వేసుకోవచ్చు.
జామకాయ ఐస్‌క్రీమ్
కావాల్సిన పదార్థాలు: జామకాయలు – 4, పాలు – అర కప్పు, బీట్‌రూట్ జ్యూస్ – 4 చుక్కలు, పటిక బెల్లం – 3 చెంచాలు, ఉప్పు – చిటికెడు, పాల పొడి – 1/3 కప్పు, డ్రైఫ్రూట్స్ పలుకులు – కొద్దిగా.
తయారీ విధానం: పాలను బాగా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. జామకాయలను బాగా కడిగి, తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత వాటి పైభాగాన్ని అంటే కాడలు ఉన్నవైపు కొద్దిగా కట్ చేయాలి. స్పూను సహాయం తో జామకాయల లోపలి గుజ్జు, గింజలు తీసి, వాటిని ఒక బౌల్‌లో వేయాలి. మిక్సీజార్‌లోకి జామకాయ గుజ్జు, కాచి చల్లార్చిన చిల్డ్ మిల్క్, బీట్‌రూట్ జ్యూస్ డ్రాప్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులోకి పటిక బెల్లం, ఉప్పు, పాల పొడి వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌ను ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. అనంతరం డ్రైఫ్రూట్స్ పలుకులు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జామకాయలలో నింపి, వాటి పైభాగాలను మూసివేయాలి. వాటిని ఫ్రీజర్‌లో 6 -7 గంటలు ఉంచి ఆ తర్వాత బయటికి తీసి పొడుగ్గా కట్ చేసుకుని తేనె, డ్రైఫ్రూ ట్స్‌తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరి.
ఆరోగ్య ప్రయోజనాలు: జామకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని విటమిన్లు, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సహా ఇతర పోషకాలు బరువు తగ్గడం, డయాబెటిస్ కంట్రోల్, చర్మంపై ముడతలు తగ్గించడం లాంటి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుతం మేకప్ ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమైంది. అయితే ఈ విషయంలో కొంతమంది కొన్ని షార్ట్‌కట్స్ ఫాలో అవుతుంటారు. అవి ఎంతవరకు మనకు మంచిదో చూద్దాం…
ఆఫీస్ పూర్తవగానే అటు నుంచి అటే ఫంక్షన్‌కు వెళ్ళాల్సి వస్తుంది. అపుడు ఉదయం వేసుకున్న మేకప్‌పై నుంచే తిరిగి టచప్ ఇస్తుంటారు చాలామంది. కానీ అలా చేయకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మేకప్ పైన వేసే మేకప్ సరిగా సెట్ అవ్వదు. పైగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. చర్మం బాగా ఎండిపోయినట్లు నిర్జీవంగా మారిపోవడమే కాకుండా మొటిమలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు.
సన్‌స్క్రీన్ తప్పనిసరి..!
చాలామంది మేకప్ వేసుకున్నాం కదా.. ఇంక సన్‌స్క్రీన్ అవసరం లేదనుకుంటారు. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించగలిగేది సన్‌స్క్రీన్ మాత్రమే. సన్‌స్క్రీన్ రాసుకున్న తర్వాత దాని మీద మామూలుగా మేకప్ వేసుకున్నా సెట్ అవుతుంది.
బ్రష్‌లు శుభ్రం చేస్తున్నారా..?
మీరు ఉపయోగించే మేకప్ బ్రష్‌లను తరచూ శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేయకపోతే వాటిపై బ్యాక్టీరియా చేరుతుంది.. వాటిని తిరిగి ఉపయోగిస్తే లేనిపోని చర్మ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే! అందుకే మేకప్‌కు ఉపయోగించే బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
డ్రయర్‌తో తల ఆరబెడుతున్నారా?
పొద్దున్నే లేచి, తలస్నానం చేసే సరికే ఆఫీసు టైం దగ్గరపడుతుంది. ఇక తల ఆరబెట్టుకునే టైం ఎక్కడుంటుంది? అందుకే గబగబా హెయిర్ డ్రయర్‌తో ఆరబెట్టేసి, స్ట్రెయిట్‌నర్‌తో స్ట్రెయిట్ చేసేసి, నచ్చిన హెయిర్ స్టైల్ వేసేసుకుంటారు చాలామంది. కానీ దానివల్ల జుట్టు ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది. హెయిర్ డ్రయర్స్, స్ట్రెయిట్‌నర్స్, కర్లర్స్.. ఇవన్నీ ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. ఫలితంగా జుట్టులో ఉండే సహజ నూనెలు ఆవిరైపోతాయి. కాసేపటికే జుట్టు గరుకుగా, నిర్జీవంగా తయారవుతుంది.
నిద్రపోయే ముందు..
పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లొచ్చి బాగా అలసిపోయారు. ఇక, ఏ పనీ చేసే ఓపిక లేక అలాగే వెళ్లి మంచం ఎక్కేస్తారు. ఇలా చేస్తే మీ చర్మానికి మీరే హాని తలపెట్టినట్లవుతుంది. ఎందుకంటే ముందు మీ ముఖానికి ఉన్న మేకప్‌ను పూర్తిగా తొలగించుకోవాలి. లేదంటే మేకప్ అవశేషాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మతకణాలు, మొటిమల సమస్యలు వస్తాయి.
గడువు తేదీ గమనిస్తున్నారా?
మేకప్ సామగ్రి కొన్న తర్వాత అవి ఎన్ని రోజులు ఇంట్లో అలానే ఉన్నా వాటిని ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ, వీటి గడువు తేదీ కూడా ఎప్పటికప్పుడు గమనించాలంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎక్స్‌పైరీ దాటిన ఉత్పత్తులను ఉపయోగిస్తే అలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువంటున్నారు. కాబట్టి గడువు తేదీని బట్టి ఏడాదికోసారి మేకప్ ఉత్పత్తులు మార్చడం మంచిది.