క‌రోనా క‌ల‌వ‌రం

– కొత్త వేరియంట్‌ జెఎన్‌-1 వ్యాప్తి
– హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసుల నమోదు
– చలి తీవ్రత ఉన్నందున వ్యాప్తికి అవకాశాలు
– వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం
– ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని సూచన
– మాస్క్‌ వాడకం అనివార్యమంటున్న నిపుణులు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరోనా కలవరం మళ్లీ మొదలైంది. రెండేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ప్రజల్లో కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌-1 అలజడి సృష్టిస్తోంది. కేరళ, తమిళనాడు, హైదరాబాద్‌లోనూ వ్యాప్తిస్తుండడంతో ప్రజల్లో కరోనా కాలం నాటి అప్రమత్తత అనివార్యమైంది. చలి తీవ్రంగా ఉన్నందున వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలెక్కవగా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ను ఆదిలోనే అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం అప్రమత్తం చేస్తుంది. హైదరాబాద్‌లో కరోనా కేసులు నమోదైనందున పక్కనే ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ప్రజలు జాగ్రతలు తీసుకోక తప్పదు.
చలి తీవ్రత.. వాతావరణ మార్పులు
వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కొంత కాలంగా చలి తీవ్రత పెరిగింది. ఒక పక్క చలి పెరగడం, వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్‌గా వచ్చే వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటికే దగ్గు, సర్ది, జ్వరం వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. టైఫాయిడ్‌, డెంగ్యూ జ్వరాలతో పాటు శ్వాశకోశ వ్యాధులు ప్రబలుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత కూడా పెరుగుతోంది. పగటి పూట ఎండ కాచినా చలిగాలులు వీస్తుండడంతో పగటి పూట కూడా రాత్రి మాదిరే చలి పెడుతుంది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ సీజన్‌లో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సీజన్‌లో కరోనా ఇబ్బందులు కూడా వస్తే ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కరోనా కొత్త వేరియంట్‌ జెఎల్‌-1 వ్యాప్తి చెందకుండా జాగ్రతలు తీసుకోవాలి. అందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీజనల్‌ వ్యాధుల్లో ముఖ్యంగా శ్వాశకోశ వ్యాధులు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎందుకంటే కరోనా కొత్త వేరియంట్‌ జెఎల్‌-1 కూడా శ్వాశ కోశ ఇబ్బందుల్ని కల్గించే అవకాశముందంటున్నారు. కరోనా మూడు వేవ్‌ల్లో కరోనా సోకిన వాళ్లకు కూడా ఈ కొత్త వేరియంట్‌ ప్రభావం చూపే అవకాశముందంటున్నారు.
ప్రజారోగ్య ప్రమాదం తక్కువే
కోవిడ్‌-19 కొత్త వేరియంట్‌ జెఎన్‌-1 ఆసక్తి వేరియంట్‌గా వర్గీకరించి దీని వల్ల ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటికే కోవిడ్‌ జెఎన్‌-1 యొక్క కొత్త ఉప వేరియంట్‌ వల్ల కలిగే ప్రజారోగ్య ప్రమాదం తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌లు జెఎన్‌-1 కోవిడ్‌-19 వైరస్‌ మొక్క ఇతర వేరియంట్ల వల్ల సంభవించే వ్యాధి వ్యాప్తి మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని డబ్యూహెచ్‌ఓ వెల్లడించింది.
అప్రమత్తత ప్రకటించిన ప్రభుత్వం
ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆసుపత్రిలో కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌-1 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తప్పకుండా మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌ ధరించకపోతే వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదమున్నందున తప్పని సరిగా పాటించాలని సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట జెఎన్‌-1తో జాగ్రతగా ఉండాలని చెబుతోంది. కరోనా కేసులు నమోదు కాకుండా ఉండేందుకు తగిన జాగ్రతలు, చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. గతంలో కోవిడ్‌-19 మూడు వేవ్‌ల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలి రెండు వేవ్‌లో మరణాల సంఖ్య విపరీతంగా ఉన్నందున కొత్త వేరియంట్‌ సమయంలో తగిన జాగ్రతలు తీసుకోవాల్సి ఉంటుంది.
చలి తీవ్రత.. తస్మా జాగ్రత
కోవిడ్‌-19 తర్వాత కొత్త వేరియంట్‌ జెఎన్‌-1 వ్యాప్తి చెందుతున్న వేళ చలి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రతలు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కొత్త ఉప వేరియంట్‌ లక్షణాల్లో జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి కనిపిస్తాయని వైద్యులు నిర్దారించారు. కొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయంటున్నారు. నాలుగైదు రోజుల పాటు ఈ లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. రద్దీగీ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లే సమయంలో విధిగా మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు. మిగతా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలోనూ ఇవే లక్షణాలు కలినిపిస్తున్నాయి. కొత్త వేవ్‌ వస్తుందని భయపడాల్సిన అవసరంలేదని వైద్య నిపుణులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. పరిశుభ్రత పాటించడం, సోషల్‌ డిస్టెన్స్‌, మా స్క్‌లు ధరిం చడం లాం టి జాగ్రతలు తీసుకోవాలంటుఆన్నరు. శ్వాస సంబంధిత సమస్య అధికమైతే కోవిడ్‌ టెస్టులు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. గొంతు నొప్పి మొదలైనట్లుగా ఉంటే గోరువెచ్చని నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు.
క్రిస్‌మస్‌, కొత్త సంవత్సర వేడుకలు
కరోనా కొత్త వేరియంట్‌ వ్యాపిస్తున్న సమయంలో తగిన జాగ్రతలు తీసుకోవాల్సిన అవసరముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నెల 25న క్రిస్‌మస్‌ పండగ ఉన్నందున మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గ్రాండ్‌ క్రిస్‌మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ రెండు వేడుకల సందర్భంగా ప్రజలు సమూహంగా పాల్గొనే వేడుకల్లో జాగ్రతలు తీసుకోవాలని చెబుతున్నారు. మెదక్‌ చర్చితో పాటు అనేక చర్చీల్లో క్రిస్‌మస్‌ వేడుకలు జరుపుకుంటారు. తప్పని సరిగా మాస్క్‌లు ధరిస్తే మంచిందంటున్నారు. న్యూ ఇయర్‌ వేడుకల్లోనూ జాగ్రతలు తప్పవని పోలీసులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌, ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలు కొనసాగించే వాళ్లు సైతం తగిన జాగ్రతలు తీసుకోవాలి.

Spread the love