– తీర ప్రాంతానికి మరో ముప్పు
– ఇప్పటికే పూర్తయిన డ్రోన్ సర్వే
అమరావతి : కృష్ణపట్నం పోర్టు విస్తరణ కోసం సముద్రపు ఒడ్డునే ఉన్న 775 ఎకరాల ఉప్పు భూములను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదాని గ్రూపు కోరింది. ఆ సంస్థకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కొద్ది రోజుల క్రితం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు నిజానికి కృష్ణపట్నం తీరంలోని ఈ భూముల పై పోర్టు యాజమాన్యం కన్ను ఇప్పటిది కాదు!
ఇక్కడే కాదు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో ఉన్న ఉప్పు భూములను తమకు అప్పగించాలని కార్పొరేట్ యాజమాన్యాలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. పర్యావరణ పరంగా సున్నితమైన ఈ భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయించ కూడదని నిబంధనలు స్పష్టంగా ఉండటంతో వాటి ప్రయత్నాలు ఫలించలేదు. వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చివేసింది. ఉప్పు భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి గ్రీన్ సిగల్ ఇస్తూ గుట్టుచప్పుడు కాకుండా కొద్దిరోజుల క్రితం సర్క్యులర్ జారీ చేసింది. వెంటనే కార్పొరేట్ డేగలు ఆ భూములను ఎగరేసుకుపోవడానికి సిద్ధమయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలోని ఉప్పు భూములపై తొలివేటు పడింది. బిజెపి భాగస్వామ్యంతో నడిచే ఆ రాష్ట్ర ప్రభుత్వం అదాని సంస్థకు ఆ భూమిని అప్పగించింది. దేశంలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ‘ధారవి’లో పునరుద్దరణ ప్రాజెక్టులో భాగంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే పేరిట ఈ పందేరాన్ని పర్యావరణ వేత్తలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా అక్కడి ప్రభుత్వం పట్టించకోవడం లేదు. ముంబాయి తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పు భూములను స్వాధీనం చేసుకోవడంపై అదాని సంస్థ దృష్టి సారించింది.
ఎంత విస్తీర్ణం…?
దేశ వ్యాప్తంగా 59,768 ఎకరాల్లో ఉప్పు భూములు ఉన్నాయి. వీటిలో అత్యధికం 20, 716 ఎకరాలు ఉన్న ఘనత మన రాష్ట్రానిదే! మన రాష్ట్రం తరువాత తమిళనాడు, మహారాష్ట్రలు ఉన్నాయి. ఆహారంలో అత్యంత కీలకమైన ఉప్పు ఈ భూముల్లోనే సాగవుతుంవటం, పర్యావరణ పరంగా అత్యంత కీలకం కావడంతో ఈ భూములను మొదటి నుండి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంచారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక అధికారులను, సిబ్బందిని నియమించి ఈ భూముల పరిరక్షణతో పాటు, ఉప్పు తయారీని పర్యవేక్షించేది. దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రారంభమైన కార్పొరేట్ సంస్థల కన్ను ఈ భూములపై పడింది.
నిబంధనల్లో మార్పులు ఇలా…
ఉప్పు తయారీకి ఇతర అవసరాలకు ఈ భూములను వినియోగించ కూడదన్న నిబంధన చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే, ముంబాయితో పాటు మరికొన్ని ప్రాంతాలో ప్రజావసరాల కోసం ఈ భూమిని వినియోగించుకోవాలన్న విజ్ఞప్తిని అనేక ప్రభుత్వ సంస్థలే చేశాయి. ఈ నేపథ్యంలో 2012వ సంవత్సరంలో మొట్టమొదటి సారి ఈ నిబంధనలను మార్చారు. అప్పడు కూడా ప్రైవేటు సంస్థలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ భూములు అప్పగించకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. అదే సమయంలో పర్యావరణ అంశాలను, నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాలని నిర్దేశించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా తొలుత కేంద్ర ప్రభుత్వశాఖలకు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, చివరగా రాష్ట్ర ప్రభుత్వశాఖలకు, సంస్థలకు కేటాయించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ భూములు పొందే సంస్థలు ఉప్పుతయారీకి ప్రత్యామ్నాయ భూమిని చూపించడంతో పాటు, మార్కెట్ విలువ కూడా చెల్లించాల్సిఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ నిబందనలను మరింతగా దిగజార్చారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వాటి ఆధీనంలోని వివిధ సంస్థలు ఆన్‌లైన్‌లో వేలంలో భూములను తీసుకోవడానికి ముందుకు రాకపోతే, ప్రైవేటు సంస్థలను అనుమతించవచ్చు.’ అని తాజా నిబంధనల్లో పేర్కొ న్నారు. అదే విధంగా ఈ భూములను దక్కించుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆ భూములను సబ్‌లీజుకు ఇయ్యవచ్చని నిబంధనల్లో పేర్కొన్నారు. 99 సంవత్సరాల వరకు ఈ సబ్‌లీజుకు కాలపరిమితిని విధించారు. మురికివాడల అభివృద్ధి, బలహీన వర్గాల గృహనిర్మాణం వంటి పథకాల అమలును ఈ సబ్‌లీజుకు ఇవ్వడానికి షరతులుగా విధించినప్పటికీ, ఒకసారి భూములు దక్కించుకున్న తరువాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మార్గదర్శకాల్లో పర్యావరణ పరిరక్షణ, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సిఆర్‌జడ్) నిబంధనలు పాటించడం వంటి అంశాల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.
చకచకా కదలిక
కొన్ని సంవత్సరాలుగా ఉప్పు భూముల గురించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ భూములపై అజమాయిషీ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చందిన సాల్ట్ కమిషన్ ఆఫీసులు అనేక చోట్ల నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. కొన్ని చోట్ల ఈ కార్యాలయాలను మూసివేసి సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నారు. అయితే, ఈ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టవచ్చంటూ నిబంధనలు సవరించగానే ప్రభుత్వ శాఖల్లో కదలిక వచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ భూముల స్థితిగతులపై సర్వేలు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఉప్పు భూములున్న అన్ని ప్రాంతాల్లోనూ డ్రోన్‌ల సహాయంతో సర్వేను ఇప్పటికే పూర్తి చేశారు. భూముల ప్రస్తుత స్థితిగతులకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సేకరించారు. స్థానికులెవరైనా ఈ భూముల్లో ప్రవేశించి ఉంటే వారిని ఖాళీ చేయించే పనులు కూడా ప్రారంభమయ్యాయి.
పోర్టులకు.. పారిశ్రామిక అవసరాలకు కూడా…
గత ఉత్తర్వుల ప్రకారం కాలుష్యానికి, పర్యావరణ ధ్వంసానికి కారణమయ్యే అన్ని రకాల పనులను ఈ ఉప్పు భూముల్లో నిషేధించారు. తాజా ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నమైన వైఖరి తీసుకుంది. పోర్టులకు, పోర్టు అనుబంధ కార్యక్రమాలకు కూడా ఈ భూములను కేటాయించవచ్చని పేర్కొంది.