రైతు రక్షణ కోసం ‘కార్పొరేట్‌ క్విట్‌ ఇండియా’ ఉద్యమం

– ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజ్జు కృష్ణన్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నదని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజ్జుకృష్ణన్‌ ఆందో ళన వ్యక్తం చేశారు. రైతు రక్షణ కోసం ‘కార్పొరేట్‌ క్విట్‌ ఇండియా’ నినాదంతో ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడో శోభన్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అమెరికాలో ఒక రైతుపై 7,253 డాలర్లు ఖర్చుచేస్తే, యూరోపియన్‌ దేశాలు రైతుపై 1068 డాలర్లు ఖర్చు చేస్తున్నాయన్నారు. మనదేశంలో కేవలం 49 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 2014లో మోడీ రైతులకిచ్చిన హామీలను ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని చెప్పారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరల విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యి. 2014 నుండి 2022 వరకు లక్షకు పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చిన కార్మికులే ఉన్నారని తెలిపారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందనడానికి ఆత్మహత్యలే నిదర్శనమన్నారు. రైతుల హక్కుల ను కాపాడాలంటూ మే 26 నుంచి జూన్‌ 15 వరకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిరసనలు, ర్యాలీలు, ఎంపీలకు మెమోరాండాలు ఇవ్వాలన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు రెండో దశ పోరాటాలను కొనసాగించాలని కోరారు. కార్పొరేట్‌ క్విట్‌ ఇండియా నినాదంతో పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ, సెమినార్లు నిర్వహించాలని సూచించారు. పార్లమెంటు నియోజక వర్గస్థాయిలో కార్పొరేట్‌ వ్యతిరేక మార్చ్‌ నిర్వహించాలని చెప్పారు. నవంబర్‌ 26, 28 తేదీల్లో స్థానిక సమస్యలపై కనీసం మూడు రోజులు రాత్రి, పగలు ‘మహాపరావ్‌’ నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Spread the love