హయ్యర్‌ పెన్షన్‌ దరఖాస్తు లోపాలు సరిదిద్దండి

–  ఆర్టీసీ కార్మికుల కేవైసీలు అనుమతించాలి
–  పీఎఫ్‌ కార్యాలయం ఎదుట టీఎస్‌ఆర్టీసీ జేఏసీ ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల హయ్యర్‌ పెన్షన్‌ దరఖాస్తుల్లో లోపాలను సరిదిద్దాలని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారంనాడిక్కడి బర్కత్‌పురా ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్న చిన్న తప్పులకు కూడా హయ్యర్‌ పెన్షన్‌ దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారని వారు తెలిపారు. ధర్నాకు జేఏసీ చైర్మెన్‌ కే రాజిరెడ్డి (ఎంప్లాయీస్‌ యూనియన్‌) అధ్యక్షత వహించారు. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి పీ ప్రకాశ్‌, ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి, బీకేయూ ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య, జేఏసీ నాయకులు ఎమ్‌ వెంకట్‌గౌడ్‌, అంజిబాబు, ఎమ్‌ఏ మాజీద్‌, బీ జకరయ్య తదితరులు మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 1,600 మంది ఉద్యోగుల కేవైసీ ఫారాలను రీజినల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ తిరస్కరించారని తెలిపారు. ఆధార్‌ కార్డులో, పీఎఫ్‌ రికార్డులో, ఆర్టీసీ సర్వీస్‌ రికార్డ్‌లో పేర్లు వేర్వేరుగా ఉన్నాయని దరఖాస్తులు తిరస్కరిస్తున్నారనీ, దీనిపై జాయింట్‌ డిక్లరేషన్‌ ఇచ్చినా పరిగణనలోకి తీసుకోవట్లేదని తెలిపారు.ఆర్టీసీ కార్మికు లు అప్లై చేసుకున్న కేవైసీ ఫారాలను అనుమతించాలని కోరారు. అనంతరం రీజినల్‌ పీఎఫ్‌ కమిషనర్‌-2 డీవీకే పావనికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి, సర్వీసులో ఉన్న వారికి ఏలాంటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రిటైర్‌ అయిన వారి కేవైసీ సమస్యను పరిష్కారం చేశామని చెప్పారు. రిటైర్‌ అయిన ఉద్యోగి చనిపోతే, ఆ ఉద్యోగి బార్య హయ్యర్‌ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశం లేదని తెలిపారు.

Spread the love