– దిగజారుతున్న భారత్ పరిస్థితి పొరుగు దేశాల కంటే దారుణం
– అరికట్టడంలో వైఫల్యం
అన్ని శాఖలూ అవినీతిమయమే
గత సంవత్సరపు అవినీతి సూచికలో మన దేశం ఏకంగా 17 స్థానాలు కోల్పోయింది. దేశాన్ని, రాష్ట్రాలను పాలించిన ప్రతి పార్టీ తాను అవినీతిని చాలా వరకూ నిర్మూలించానని గొప్పలు చెప్పుకుంటుంది. అయితే అవినీతి సూచికలో భారత్ ర్యాంక్ భారీగా పతనమవడాన్ని గమనిస్తే అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి. అవినీతికి వ్యతిరేకంగా దేశంలో 2012లో ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు అదే ప్రధానాంశంగా నిలిచింది. పరిపాలనలో పెచ్చరిల్లిన అవినీతి జాడ్యంపై చర్చోపచర్చలు సాగాయి. మరి గడచిన పుష్కర కాలంలో దేశంలో అవినీతి తగ్గిపోయిందా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. పొరుగు దేశాలైన చైనా, భూటాన్, సింగపూర్, మలేసియా ఈ సమస్యను ఎదుర్కోవడంలో మంచి విజయాలు సాధిస్తే మనం ఎందుకు విఫలమవుతున్నాము?
ఏ దేశ చరిత్ర చూసినా…
భారత్‌లో అవినీతిపై గత సంవత్సరం టీఐ సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందుగలడందు లేడన్నట్లు దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు…పోలీస్, రెవెన్యూ,దిగువ స్థాయిలోని న్యాయ వ్యవస్థ, విద్య, ఇంజినీరింగ్… ఇలా అన్ని శాఖలూ అవినీతి నిలయాలుగా మారాయని టీఐ స్పష్టం చేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ విస్తరించ బడుతుంటే జాతీయ రహదారులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాల ఆధునీకరణ, కొత్త ఓడరేవులు, భారీ గృహనిర్మాణ పథకాలు, పట్టణీకరణ ప్రాజెక్టులు…ఇలా అనేక మౌలిక సదుపాయాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ ప్రాజెక్టులలో భారీగా అవినీతి చోటుచేసుకుంటోంది.
న్యూఢిల్లీ : సంపన్న దేశాలతో పాటు వర్ధమాన దేశాలు కూడా అవినీతి సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. అమెరికాలోని పలు రైల్‌రోడ్డు ప్రాజెక్టుల్లో అవినీతి చోటుచేసుకుంది. నిషిద్ధ కాలంలో అమెరికా పోలీసు వ్యవస్థకు అవినీతి చెద పట్టింది. 1970వ దశకంలో హాంగ్‌కాంగ్‌లో ‘టీ మనీ’ ముడుపుల వ్యవస్థ ఉండేది. సొమ్ము ముట్టజెబితేనే ప్రాధమిక సేవలు అందుబాటులోకి వచ్చేవి. టెలిఫోన్లను ఒక చోటు నుండి మరో చోటికి మార్చడంతో మొదలుకొని అగ్నిప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది రావడం వరకూ… ప్రతి సేవకూ అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించాల్సిందే. ఇక జపాన్‌లో లాక్‌హెడ్ విమాన కాంట్రాక్టులు పొందేందుకు భారీగా డబ్బు ముట్టజెప్పారు. ఈ కుంభకోణం అప్పటి ప్రధాని కాకీ తనాకా అరెస్టుకు దారితీసింది. ఆయన నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. జర్మనీ రక్షణ మంత్రి పైన, నెదర్లాండ్స్ రాకుమారుడి పైన వచ్చిన అవినీతి ఆరోపణలు వారి రాజకీయ జీవితాన్ని బాగా దెబ్బతీశాయి. అప్పటి నుండి చాలా దేశాలు రక్షణ చర్యలు చేపట్టి తమ సమాజాలకు అవినీతి చీడ అంటకుండా జాగ్రత్త పడ్డాయి.
దిగజారుడే
వివిధ దేశాల్లో అవినీతి ఏ మేరకు ఉన్నదనే విషయాన్ని గుర్తించేందుకు ప్రామాణికమైన పద్ధతి అంటూ ఏదీ లేదు. అయితే ప్రపంచంలో ప్రధానంగా రెండు సంస్థలు అవినీతిపై సమాచారాన్ని ప్రచురిస్తున్నాయి. అవే ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ), ప్రపంచబ్యాంక్. ప్రపంచబ్యాంక్ తన పరిపాలనా సూచికలో భాగంగా అవినీతి సమాచారాన్ని అందిస్తోంది. 2023లో అవినీతి సూచికలో భారత్ స్థానం 93 (మొత్తం దేశాలు 180). 2018లో ఈ ర్యాంక్ 85గా ఉండేది. 2016లో మన దేశం 79వ ర్యాంకులో ఉంది. అంటే ప్రతి సంవత్సరం అవినీతిలో భారత్ ర్యాంక్ దిగజారుతోందే తప్ప మెరుగుపడుతోంది లేదు. దీనిని బట్టి అర్థమవు తోంది ఏమిటంటే గత కొన్ని సంవత్సరాల కాలంలో దేశంలో అవినీతి పెరగడమో లేదా ఇతర దేశాలు తమ పరిస్థితిని మెరుగుపరచుకోవడమో జరిగింది.
ఫలితమివ్వని ఉద్యమం
అవినీతిని అదుపు చేయడంలో వైఫల్యం చెందడం మరో కోణం నుండి కూడా ఆందోళన కలిగిస్తోంది. 2012-13లో అవినీతిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ప్రజా బాహుళ్యం కలిగిన శక్తివంతులైన నేతలు అందులో భాగస్వాములయ్యారు. రాజకీయాలలో సమూల మార్పులు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రజలకు నొక్కి చెప్పారు. అవినీతి కేసుల విచారణ కోసం లోకాయుక్తతో పాటు లోక్‌పాల్ తరహా వ్యవస్థ ఉండాలన్న చర్చ జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కర్నాటకలో మినహా మరెక్కడా లోకాయుక్త లేదు.
వైఫల్యానికి కారణమేమిటి?
అవినీతిని అరికట్టడంలో భారత్ ఎందుకు విఫలమవుతోంది? ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాయి. రాజకీయ పార్టీలకు ప్రైవేటు రంగం విరాళాలు అందిస్తుంది. ఇక్కడే క్విడ్ ప్రోకో మొదలవుతుంది. తమకు భారీగా వివరాలు ముట్టజెప్పే కంపెనీలు, సంస్థలకు పాలకులు వివిధ కాంట్రాక్టులు కట్టబెడుతుంటారు. సెంటర్ ఆఫ్ మీడియా స్టడీస్ అంచనా ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు కలిసి రూ.50,000 కోట్లు ఖర్చు చేశాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఈ వ్యయం లక్ష కోట్లకు చేరిందని అంచనా. ఇదంతా రాజకీయ నాయకులు సంపాదించిన అవినీతి సొమ్మే. సామాన్యులు తమ అవసరాల కోసం అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి లంచాలు, చిన్న చిన్న బహుమతులు సమర్పించుకోవడం సర్వసాధారణమై పోయింది. ఈ జాబితాలో ఏసీలు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులు ఉంటున్నాయి. బడా బాబులు కాంట్రాక్టులు పొందేందుకు అధికార గణానికి భారీగానే సొమ్ము ముట్టజెబుతుంటారు. అందుకే అధికారుల దృష్టంతా కాంట్రాక్టులు, ప్రాజెక్టుల పైనే ఉంటుంది. పెద్ద ఎత్తున లంచాలు అందుకునే అవకాశం వాటిలోనే ఉంటుంది మరి. పైగా పట్టుబడే అవకాశాలు పెద్దగా ఉండవు. అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు అవసరమే. అయితే ఈ తరహా పెట్టుబడులు అవినీతిని ప్రోత్సహిస్తాయి. ఈ పరిణామాలన్నీ అవినీతిని పెంచి పోషిస్తున్నాయి.