– వర్షాభావంతో మొలకెత్తని గింజలు
– 60 మి.మీ నమోదైతేనే విత్తనాలు నాటాలి..
– అనేక చోట్ల 20శాతానికి పైగా లోటు వర్షపాతం
– సరిపడా తేమలేక భూమిలోనే దెబ్బతిన్న గింజలు
– ఆర్థిక భారంతో అవస్థలు.. వానకోసం రైతు నిరీక్షణ
– రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దూది పూలసాగు దు:ఖం తెప్పిస్తోంది. ఏటేటా పంట సాగు విస్తీర్ణం పెరుగుతున్నా.. ధరల్లో పదేండ్ల్లుగా పెద్ద వ్యత్యాసం ఉండటం లేదు. అయినా రాష్ట్రంలో భూములు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు వరి తర్వాత అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. ఆర్నెళ్ల పంటకాలంలో ప్రతియేటా ఏదో ఒక దశలో ప్రకృతి వైపరీత్యాలతో పత్తి రైతులు నష్టపోతున్నారు. అతివృష్టి లేదంటే అనావృష్టి పత్తి రైతులను దెబ్బతీస్తోంది. ఈసారి వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. రోహిణి కార్తె ముందు నుంచే చెదురుమదురు వానలు కురుస్తుండటంతో జూన్ ఆరంభం నుంచి రైతులు విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. 60 మి.మీ వర్షపాతం నమోదైతేనే పత్తి విత్తనాలు నాటాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నా.. చాలా మంది రైతులు ”వర్షాలు కురవకపోతాయా..” అన్న ధీమాతో అరకొర తేమకే విత్తనాలు వేశారు. రాష్ట్రంలో అధిక ప్రాంతాల్లో 20శాతంకు పైగా లోటు వర్షాలు కురవడంతో సరైన పదును లేక గింజలు మొలకెత్తలేదు. బావులు, బోర్లున్న రైతులు తడులివ్వగా.. వర్షాధారంగా సాగు చేస్తే మాత్రం మరోసారి విత్తక తప్పని స్థితి నెలకొంది.
మళ్లీ విత్తాల్సిందే..
తెలంగాణలో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్ సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా. దీనిలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని లెక్కలు వేశారు. ఖమ్మం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2,01,834 ఎకరాలు కాగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు 1,18,286 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. దీనిలోనూ సగం విస్తీర్ణంలో విత్తనాలు సరైన పదును లేక దెబ్బతింటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఎకరాలకు గాను 40 లక్షల ఎకరాల వరకు నాటినా కనీసం 10-15 లక్షల ఎకరాల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు.
ఒక్కో రైతుపై రూ.8వేల అదనపు భారం..
విత్తనాలు దెబ్బతిన్న రైతులు ఎకరానికి రూ.8వేలకు పైగా అదనపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పంట చేతికి వచ్చేనాటికి ఏటా ఎకరానికి రూ.20వేల వరకు అదనపు పెట్టుబడులు తప్పడం లేదని పత్తి రైతాంగం ఆవేదన చెందుతోంది. ఎకరానికి ఒక్కో ప్యాకెట్పత్తి విత్తనాలు రూ.864 చొప్పున కొనుగోలు చేశారు. అంటే ఎకరాకి రెండు ప్యాకెట్లకు రూ.1,728 విత్తనాలకు వెచ్చించారు. డిమాండ్ ఉన్న విత్తనాలను ఒక్కో ప్యాకెట్ రూ.1500కు పైగా వెచ్చించి బ్లాక్లో కొనుగోలు చేశారు. విత్తనాలు నాటేందుకు దుక్కిని సిద్ధం చేయడం కోసం.. ఫ్లవ్ వేయడానికి రూ.3,000, కల్టివేటర్కు రూ.3,000, రొటోవేటర్కు రూ.2,000, అచ్చుతోలకానికి రూ.1,000, విత్తనాలు నాటేందుకు రూ.600 చొప్పున మొత్తం రూ.11,328 వరకు ఎకరంలో విత్తనాలు నాటేందుకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం వెచ్చించి నాటిన విత్తనాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే 80శాతం వరకు మొలకెత్తుతాయి. గింజలు నాటిన ఐదోనాడు భూమిపై మొలకలు కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది విత్తనాలు నాటాక పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా పడలేదు. కాబట్టి విత్తనాలు మొలకెత్తని రైతులు మొదటిసారి పెట్టిన పెట్టుబడిలో ఒక ఫ్లవ్ ఖర్చు రూ.3,000 మినహా మిగిలిన అన్ని పెట్టుబడులు మళ్లీ వెచ్చించక తప్పదు. అంటే సుమారు రూ.8వేల వరకు ఒక్కో ఎకరానికి రైతు అదనపు ఖర్చు భరించాల్సి ఉంటుంది. నేలలు ఏ రకమైనా వర్షాలు లేకపోతే మాత్రం విత్తనాలు మొలకెత్తే అవకాశం లేదు. విపరీతంగా ఎండకాస్తుండటం, పూర్తి పొడివాతావరణంతో విత్తనాలు మొలకెత్తడం లేదని రైతులు వాపోతున్నారు.
బెట్ట కాలంతో గింజలు దెబ్బతిన్నాయి
మూడున్నర ఎకరాలు పత్తి విత్తనాలు పెట్టాను. ఎకరానికి రూ.11వేలకు పైగా ఖర్చు వచ్చింది. వర్షాలు లేకపోవడంతో గింజలు మొలకెత్తలేదు. రోజూ మబ్బులు పడుతుంటే ఆశగా చూస్తున్నాం. కానీ బట్టతడుపు వాన కూడా రావట్లేదు. బెట్ట కాలంతో గింజలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మళ్లీ ప్యాకెట్లు తెచ్చి విత్తనాలు వేయక తప్పదు. వానలు లేకపోవడంతో మూడున్నర ఎకరాల పేరు మీద రూ.28వేలకు పైగా నష్టపోవాల్సి వస్తుంది. కనీసం పంటకు మంచి రేటైనా పడితే కొంత ఆర్థికభారం తప్పుతుంది.
– యండ్రపల్లి రవికుమార్, రైతు, వల్లాపురం, ముదిగొండ