ఉమ్మడి వరంగల్‌పై రూ.5.16 కోట్ల భారం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలోనే మూడో అతిపెద్ద పత్తి సాగుచేసే రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి 2021 -22లో 25లక్షల టన్నులకు చేరింది. పత్తి సాగు విస్తీర్ణం 17లక్షల హెక్టార్ల నుంచి 12 శాతం పెరిగి 19లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఈ ఏడాది వానా కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి సాగు 6 లక్ష ఎకరాలకు పెరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాల వానాకాలం పత్తి సాగు విస్తీర్ణాన్ని పరి శీలిస్తే 5.45 లక్షల ఎకరాల మేరకు గతేడాది సాగు చేయగా, ఇప్పుడు 10 నుంచి 15 శాతం మేరకు సాగు పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయాధికా రులు స్పష్టం చేశారు. దాంతోపాటు విత్తన ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది బీటీ పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.810 ఉండగా, ఈ వానాకాలంలో వాటి ధరను ప్యాకెట్‌పై రూ.43 మేర కు పెంచగా.. రూ.853లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. పత్తి సాగుకు అయ్యే పెట్టుబడి సహజం గానే అధికంగా ఉంటుండగా, బీటీ విత్తనాల ధర తాజా పెంపుతో పెట్టుబడులు మరింత పెరగనున్నా యి. గత వానాకాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,45,405 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. ఈ వానాకాలం పంటల ప్రణాళికలో పత్తి సాగును పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పత్తి సాగు 10-15 శాతం పెరుగ నుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల మేరకు పత్తి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనగామ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పత్తిని రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. గత వానాకాలంలో వరంగల్ జిల్లాలో 1.29 లక్షల ఎకరాలు, హన్మకొండ జిల్లాలో 87,102 ఎకరాలు, జనగామ జిల్లాలో 1.40లక్షల ఎకరాలు, మహబూ బాబాద్ జిల్లాలో 73 వేల ఎకరాలు, ములుగు జిల్లాలో 26,303 ఎకరాలు, జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 90 వేల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు.
రూ.5.16 కోట్ల భారం
బీటీ పత్తి విత్తనాల ధర పెంపుతో ఉమ్మడి వరంగల్ జిల్లాపై 5.16 కోట్ల మేరకు రైతాంగంపై భారం పడనుంది. గత వానాకాలంలో పత్తి సాగు చేసిన మేరకే ఈసారి కూడా సాగు జరిగితే రూ.4.68 కోట్ల భారం పడుతుంది. పత్తి సాగు 6 లక్షల ఎకరాలకు పెరిగితే రూ.5.16 కోట్లకు పెరుగనుంది. రైతులు ఎకరాకు రెండు ప్యాకెట్లను విత్తుతున్నారు. 5,45,405 ఎకరాల్లోనే పత్తి సాగైతే 1.90 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. 6 లక్షల ఎకరాలకు సాగు పెరిగితే 12 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం కానున్నాయి.
పెరగనున్న పత్తి సాగు
ఈ వానాకాలంలో వ్యవసాయాధికారుల అంచనాల మేరకు పత్తి విస్తీర్ణం పెరిగితే 10 శాతం మేరకు సాగు పెరిగినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశముంది. ఈ వానాకాలంలో అధికారుల అంచనాల మేరకు వరంగల్ జిల్లాలో 1.30లక్షల ఎకరాలు, హన్మకొండ జిల్లాలో 90 వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 1.70లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 90 వేల ఎకరాలు, ములుగు జిల్లాలో 30 వేల ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 1 లక్ష ఎకరాలకు పత్తి సాగు పెరిగే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు.
ధరల నియంత్రణలో వైఫల్యం : ఎం. చుక్కయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, హన్మకొండ
విత్తన ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. బీటీ పత్తి విత్తనాల ధరలను ప్రతియేటా పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. గతేడాది పెంచడమే కాకుండా, ఈ ఏడాది సైతం ప్యాకెట్‌పై రూ.43 పెంచడంతో పత్తి రైతుల పెట్టుబడి మరింత పెరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తిని రైతులు గణనీయంగా సాగు చేస్తుండటంతో తీవ్రమైన భారాన్ని రైతాంగం మోయాల్సి వస్తుంది. బీటీ పత్తి విత్తనాల ధరలను నియంత్రించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.