కౌన్‌ బనేగా ఉప సభాపతి

కౌన్‌ బనేగా ఉప సభాపతి– బరిలో నిలవాలని ప్రతిపక్షాల నిర్ణయం
– ఈసారైనా ఆపోస్టును భర్తీ చేస్తారా ?
న్యూఢిల్లీ : లోక్‌సభ ఉప సభాపతి పదవికి పోటీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. గత లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని భర్తీ చేయకుండా ఖాళీగానే ఉంచారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్‌ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్‌ ఎన్నిక ఉంటాయి. ఈ సభకైనా డిప్యూటీ స్పీకర్‌ ఉంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. నూతన లోక్‌సభలో ఇండియా బ్లాక్‌కు 234 మంది సభ్యులు ఉన్నారు. అధికార పక్షానికి సభాపతి పదవి, ప్రతిపక్షానికి ఉప సభాపతి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలా వద్దా అనేది పాలక పక్షం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.17వ లోక్‌సభ సమావేశాలు అసాధారణ రీతిలో డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే ముగిశాయి. స్పీకర్‌ ఎన్నిక ముగిసిన వెంటనే డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవాలని రాజ్యాంగం చెబుతోందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ ఆచారి తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి రాజ్యాంగబద్ధమైన పదవి అని, పార్లమెంటరీ వ్యవస్థలో ఉప సభాపతికి రాజ్యాంగం ముఖ్యమైన స్థానాన్ని కల్పించిందని ఆయన చెప్పారు. ఆ పదవికి ఎవరినీ నియమించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.’సాధ్యమైనంత త్వరగా స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను లోక్‌సభ విధిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది’ అని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 93 నిర్దేశిస్త్తోంది. ‘డిప్యూటీ స్పీకర్‌ పోస్టు రాజ్యాంగ పదవి. అది ప్రతిపక్షానికి చెందుతుంది. తమకు ఆ పదవిని ఇవ్వాలని నూతన లోక్‌సభలో ప్రతిపక్షాలు కోరవచ్చు. అది సభ్యులు ఎన్నుకునే పోస్టు. ముందుగా స్పీకర్‌ను ఎన్నుకోవాలి. వారం రోజుల వ్యవధిలో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవాలి. ఇది పద్ధతి’ అని ఆచారి తెలిపారు. కాగా గతంలో తాము ఉప సభాపతి స్థానాన్ని నిర్వహించామని, ఇప్పుడు కూడా ఆ పదవికి పోటీ చేస్తామని ప్రతిపక్ష నేత ఒకరు చెప్పారు. ‘2004-2014 మధ్యకాలంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్ష ఎన్డీఏకు ఇచ్చాము. గతంలో అనేక ప్రభుత్వాలు డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఏకాభిప్రాయంతో ప్రతిపక్షాలకే ఇచ్చాయి’ అని ఆయన గుర్తు చేశారు. 1956లో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపక్ష అకాలీదళ్‌ ఎంపీ సర్దార్‌ హుకమ్‌ సింగ్‌ను డిప్యూటీ స్పీకర్‌ పదవికి ప్రతిపాదించారు. ఆ తర్వాత వచ్చిన అనేక ప్రభుత్వాలు ఈ సంప్రదాయాన్నే అనుసరించాయి. స్పీకర్‌ లేనప్పుడు ఆ స్థానంలో డిప్యూటీ స్పీకర్‌ కూర్చుని సభను నడిపిస్తారు. ఆ సమయంలో స్పీకర్‌కు ఎన్ని అధికారాలు ఉంటాయో డిప్యూటీ స్పీకర్‌కు కూడా అవే అధికారాలు ఉంటాయని నిబంధనలు చెబుతున్నాయి.

Spread the love