కౌంటర్‌… ఎన్‌కౌంటర్‌

Counter... Encounter– బీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్‌ వ్యూహం
– వారానికి రెండుసార్లు అందుబాటులో మంత్రులు
– సందడిగా మారనున్న గాంధీభవన్‌
– విజ్ఞప్తులు స్వీకరించనున్న అమాత్యులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ సర్కారుపై ఒంటికాలిపై లేస్తున్న బీఆర్‌ఎస్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్నది. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు పార్టీల నేతల కౌంటర్లకు, అధికార పక్షం ఎన్‌కౌంటర్లు విసరనుంది. అడపాదడపా కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తున్నప్పటికీ డోస్‌ సరిపోవడం లేదని భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే గులాబీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శల స్వరం పెంచుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పరస్పర ట్వీట్లతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. తమ ప్రభుత్వంలో ఇలా చేశామంటూ బీఆర్‌ఎస్‌ నేతలు…అధికారంలో ఉండి బీఆర్‌ఎస్‌ ప్రజలకు ఏమీ చేయలేదంటూ గులాబీ నేతలపై సీఎం, మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు అదే స్థాయిలో ప్రతిదాడి చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాష్ట్ర సర్కారుపై విమర్శల బాణం ఎక్కు పెట్టింది. లేనిది, ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలకు తెరదించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది. తొమ్మిది నెలలుగా కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్‌ఎస్‌ విమర్శలను పట్టించుకోని కాంగ్రెస్‌…బీజేపీ, బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నది. విమర్శలకు ప్రతి విమర్శల ద్వారా సమాధానం చెప్పేందుకు ప్లాన్‌ రెడీ చేస్తున్నది. టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతలు చేపట్టిన రోజే అందుకు శ్రీకారం చుట్టారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలకు ఆయా శాఖ మంత్రులతో దీటుగా సమాధానం చెప్పించేందుకు నూతన టీపీసీసీ అధ్యక్షులు వ్యూహరచన చేసినట్టు తెలిసింది. ముల్లును మల్లుతోనే తీయాలన్న ఉద్దేశంలో బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులకు తాజా మంత్రులను ప్రయోగిస్తున్నారు. అందుకనుగుణంగా వారానికి రెండుసార్లు మంత్రులు గాంధీభవన్‌కు రావాలని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి మంత్రులు గాంధీభవన్‌కు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్‌ను రూపొందించాలని గాంధీ భవన్‌ సిబ్బందికి టీపీసీసీ చీఫ్‌ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహేష్‌కు స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద సవాల్‌ కానున్నాయి. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తాము ప్రజాపాలనను అందిస్తున్నామనీ, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కాంగ్రెస్‌ చెబుతున్నది. మరోవైపు కాంగ్రెస్‌ పాలనపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం మహేష్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌గా చెప్పుకోవచ్చు.

Spread the love