మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసీఆర్‌కు కోర్టు నోటీసులు

To KCR on the collapse of Medigadda barrage Court notices–  జారీ చేసిన భూపాలపల్లి ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి
– హరీశ్‌రావు సహా అప్పటి ముఖ్య అధికారులకు కూడా..
– సెప్టెంబరు 5న హాజరుకావాలన్న న్యాయస్థానం
– ‘రాజలింగ మూర్తి’ రివిజన్‌ పిటిషన్‌పై విచారణ
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం(కాళేశ్వరం) మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి నోటీసులు జారీ చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సెప్టెంబరు 5న విచారణ జరపనున్నట్టు పేర్కొంది. విచారణకు రావాల్సిందిగా వారందరికీ నోటీసులు జారీ చేసింది. గతంలో భూపాలపల్లి ఫస్ట్‌ క్లాస్‌ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ అనంతరం రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి విచారణ జరపనున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై గతేడాది అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్‌లో, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతోపాటు ఎలాంటి చర్యలూ తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. తొలుత వేసిన పిటిషన్‌ ఫస్ట్‌ క్లాస్‌ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కొట్టివేసిందని, దానికి కారణాలను కూడా తెలపలేదని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత రివిజన్‌ పిటీషను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో చేశానని తెలిపారు. బ్యారేజ్‌ ఏడో బ్లాకులో పిల్లర్‌ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్లు రావడంతో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పోలీసులు కూడా ఐపీలోని సెక్షన్‌ 427 ప్రకారం ఎఫ్‌ఆర్‌ (నెం.174/2023) నమోదు చేశారని, మరుసటి రోజే దాన్ని క్లోజ్‌ చేశారని పిటిషనర్‌ గుర్తుచేశారు.
ప్రధాన ఆరోపణలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు 8 మంది ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అంతులేని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషనర్‌ ఆరోపించారు.
మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, మెకానికల్‌ వివరాలను డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కోరినా నాటి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన డాక్యుమెంట్లను ఇవ్వకుండా, లోపాలను దాచిపెట్టే ప్రయత్నం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ నిపుణుల బృందం అధ్యయనం చేసి కేంద్రానికి సమర్పించిన రిపోర్టులో ఏడో బ్లాకులోని ఒక పిల్లర్‌కు పగుళ్లు వచ్చి భూమిలోకి కుంగిపోయిందని, ఈ కారణంగా ఆ బ్లాకులోని మొత్తం పిల్లర్లను తొలగించి వీలైనంత తొందరగా కొత్త నిర్మాణం చేపట్టాలని, లేదంటే మొత్తం ప్రాజెక్టుకే ప్రమాదం ఉంటుందని వివరించిందని గుర్తుచేశారు.
వారిపైనే ఫిర్యాదు..
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కేసీఆర్‌, హరీశ్‌రావు, నాటి ఇరిగేషన్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, నాటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నాటి చీఫ్‌ ఇంజినీర్లు హరిరామ్‌, శ్రీధర్‌, నిర్మాణ బాధ్యతలు తీసుకున్న మేఘా సంస్థ యజమాని కృష్ణారెడ్డి, మరో నిర్మాణ సంస్థ (ఎల్‌ అండ్‌ టీ) జనరల్‌ మేనేజర్‌ సురేశ్‌ కుమార్‌ భాగ స్వాములుగా ఉన్నారని, వీరిపై అభియోగాలు మోపి విచారణ చేపట్టాలని పిటీషనర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసీఆర్‌ సహా ఎనిమిది మందిపై ఐపీసీ 1200, 420, 386, 406, 409 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను చట్టపరంగా శిక్షించేలా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ను ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లా కోర్టు వీరందరినీ సెప్టెంబరు 5న తనముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది.

Spread the love