నవతెలంగాణ – జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీచేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ జీఎం సురేశ్‌కుమార్ సహా పలువురికి నోటీసులు పంపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు నాటి కేసీఆర్ సర్కారే కారణమని, ప్రజాధనం దుర్వినియోగం అయినందువల్ల దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ 2023 నవంబరు 7న భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది తమ పరిధిలోకి రాదంటూ జనవరి 12న పిటిషన్‌ను ఆ కోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ రాజలింగమూర్తి ఇటీవల భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆయన దరఖాస్తును పరిశీలించిన జిల్లా కోర్టు.. సెప్టెంబరు 5న విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు, అప్పటి అధికారులు సహా మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డిలకు నోటీసులు జారీచేసింది.