నేడు సీపీజీఈటి ప్రవేశ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

– జర్నలిజం పరీక్ష రద్దు, ఆగస్టులో తిరిగి నిర్వహణ
–  కొత్తగా డేటా సైన్స్‌ కోర్సుకు నోటిఫికేషన్‌

నవతెలంగాణ- ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల 8 యూనివర్సిటీల్లో 50 పీజీ కోర్సులకు నిర్వహించిన సీపీజీఈటీ ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ని శనివారం సాయంత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండు రంగారెడ్డి తెలిపారు. మొత్తం 69,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 60,464 మంది ప్రవేశ పరీక్ష రాశారు. ఈ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించే అభ్యర్థులు 2023కు సంబంధించిన కుల, ఆదాయ సర్టిఫికెట్స్‌ సిద్ధం చేసుకోవాలని సూచిం చారు. సర్టిఫికెట్స్‌ అప్‌లోడ్‌ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
22 నుంచి 25 వరకు అభ్యంతరాల స్వీకరణ
ఈ నెల 22 నుంచి 25 అర్ధరాత్రి వరకు ప్రిలిమినరీ ‘కీ’లో తప్పులు, లోపాలు, అభ్యంతరాలు ఉంటే ఈ-మెయిల్‌కు లేదా స్వయంగా వచ్చి చెప్పొ చ్చని సూచించారు. ఇక సీపీజీఈటీ అడ్మిషన్స్‌ ప్రవేశ ప్రక్రియను ఆగస్టు 2వ వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కన్వీనర్‌ చెప్పారు.
జర్నలిజం పరీక్ష రద్దు
జర్నలిజం ప్రవేశ పరీక్షకు సంబంధించి సిలబస్‌లో పలు తప్పిదాలు జరగడంతో పరీక్షను తిరిగి ఆగస్టు మెదటి వారంలో నిర్వహించనున్నట్టు కన్వీనర్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 955 మంది విద్యార్థులు తిరిగి పరీక్ష రాయొచ్చన్నారు. దీనిపై ఇటీవల ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు వినతిపత్రం అందజేసిన విషయం తెల్సిందే.
కొత్తగా ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ కోర్సుకు నోటిఫికేషన్‌
ఒక యూనివర్సిటీ, పలు కళాశాలల అభ్యర్థన మేరకు.. ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ కోర్సుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి ప్రవేశ పరీక్ష నిర్వహించనునట్టు కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి చెప్పారు.
ఆ ఐదు విభాగాల్లో నేరుగా ప్రవేశాలు
ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో సీట్ల సంఖ్యకన్నా దరఖాస్తులు తక్కువగా వచ్చిన అరబిక్‌, మరాఠీ, కన్నడ, పర్షియన్‌, థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించలేదు.
ఈ ఐదు కోర్సుల్లో 10మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు చేసేందుకు సిద్ధంగా ఉంటే నేరుగా అడ్మిషన్స్‌ పొందే వేసులుబాటు కల్పించనున్నారు.

Spread the love