సాయిచంద్‌ మృతికి సీపీఐ సంతాపం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ సాయిచంద్‌ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అతిచిన్న వయస్సులోనే మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలతో ప్రజలను ఉత్తేజపరిచారని తెలిపారు.
ప్రజాపంథా నివాళి
తెలంగాణ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ సాయిచంద్‌ గుండెపోటుతో మరణించడం బాధకరమని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. చిన్న వయస్సులో ఇలా అకాల మరణం పొందడం ఆయన కుటుంబానికి, సాంస్కృతిక రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు.
సాయిచంద్‌ సేవలు మరువలేనిది : న్యూడెమోక్రసీ
తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్‌ ప్రజలను జాగృతం చేసిన తీరు, సామాజికంగా రాసి పాడిన పాటలు మరువలేనివని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె గోవర్ధన్‌ తెలిపారు. 39 ఏండ్లకే గుండెపోటుతో అకాల మరణానికి గురికావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులైన భార్య రజని, ఇద్దరు పిల్లలు, తండ్రి వెంకట్రాములుకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Spread the love