బీజేపీతో పొత్తుపై టీడీపీ ఊగిసలాట ధోరణిని వీడాలి: సీపీఐ నారాయణ

నవతెలంగాణ -హైదరాబాద్: పొత్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఊగిసలాట ధోరణిని వీడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, వైసీపీ కలిసే ఉన్నాయని, ఇప్పటికైనా టీడీపీ మేల్కొని ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేయాలన్నారు. వైసీపీ, బీజేపీ పార్టీలు విడిపోవని జోస్యం చెప్పారు. ఏపీలో బీజేపీ ఎంతగా కొట్లాడినా వైసీపీని ఓడించే పరిస్థితికి చేరుకోదన్నారు. ఏపీకి అన్ని విధాలుగా నష్టం చేసిన బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టీడీపీ మద్దతు అందించడం ఏమాత్రం సరికాదన్నారు. అందుకే బీజేపీతో పొత్తు గురించి ఊగిసలాట ధోరణి నుండి బయటకు వచ్చి సీపీఐ, సీపీఐ(ఎం), జనసేనతో టీడీపీ ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే వైసీపీ, బీజేపీ డబుల్ ఇంజిన్ ఫెయిల్ అవుతుందన్నారు. అది ఏపీకి కూడా ఉపయోగకరమన్నారు. చంద్రయాన్‌తో బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు. చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టి ఓ మతాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారన్నారు.

Spread the love