నవతెలంగాణ-హైదరాబాద్ : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, ఢిల్లీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కేఎం తివారీ (70) కన్నుమూశారు. ఆయన గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన భౌతికకాయాన్ని మంగళవారం సీపీఐ(ఎం) ఘజియాబాద్ జిల్లా కమిటీ కార్యాలయంలో, బుధవారం ఉదయం 09.30 నుంచి 11 గంటల వరకు హెచ్‌కేఎస్ సుర్జీత్ భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని దహన సంస్కారాల కోసం బోద్ ఘాట్‌కు తరలిస్తారు.
తివారీ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా సీపీఐ(ఎం) నాయకత్వానికి ఎదిగారు. 1977లో సిపిఐ(ఎం)లో చేరిన ఆయన… 1988లో ఢిల్లీ రాష్ట్ర కమిటీకి, 1991లో సెక్రటేరియట్‌కు, 2018లో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 2014 నుంచి 2024 వరకు సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు.
ఘజియాబాద్ పారిశ్రామిక రంగంలో సీఐటీయు నాయకత్వంలో అసంఖ్యాక సమ్మెలకు తివారీ నాయకత్వం వహించడంతో పాటు రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. చాలా సంవత్సరాలు సిఐటియు వర్కింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్‌లో పనిచేశారు. జాతీయ కార్యక్రమాల్లో భాగంగా మూడు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన ఆయన మూడేళ్ల తొమ్మిది నెలలు అజ్ఞాతంలో గడిపారు. తివారీ మృతికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సంతాపం తెలిపింది.