ఏనె గుట్టను వ్యవసాయ కేంద్రంగా మార్చాలి: సీపీఐ(ఎం) డిమాండ్

నవతెలంగాణ – వలిగొండ రూరల్
సీపీఐ(ఎం) పోరుబాటలో భాగంగా బుధవారం ప్రొద్దుటూరు గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఏనే గుట్టను సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. ఏనే గుట్టపై ఉన్న రాళ్లను తొలగించి చదును చేసి రైతుల సౌకర్యార్థం వ్యవసాయ కొనుగోలు కేంద్రంగా మార్చాలని దీనిపై ప్రభుత్వం, స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. పొద్దుటూరు గ్రామ రైతులకు వ్యవసాయ మార్కెట్ స్థలం లేకపోవడంతో అక్కడనుండి ఏదుళ్ళ గూడెం స్టేజి వద్ద ఉన్న ప్రైవేట్ భూమిని లీజుకు తీసుకొని మార్కెట్ ను కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రొద్దుటూరు నుండి ఏదుళ్ళగూడెం స్టేజి వరకు ధాన్యాన్ని తరలించడానికి రైతులపై అదనపు భారం పడుతుందని ట్రాక్టర్ల కిరాయిలు భారంగా మారి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. గోకారం, వర్కట్ పల్లి గ్రామాల నుండి సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం ధాన్యాన్ని తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఏనే గుట్టను చదును చేసి మార్కెట్ గా మార్చాలని కోరారు. అదేవిధంగా పొద్దుటూరు గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో వలిగొండకు, భువనగిరికి వెళ్లే విద్యార్థులు,ప్రజలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ ఏలే కృష్ణ, సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహాయ కార్యదర్శి పెద్దబోయిన నరసింహ, నాయకులు గొలనుకొండోజు స్వామి, బొడ్డు శంకర్,బాల నరసింహ,పెద్దబోయిన భీమరాజు,మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love