– ప్రపంచ బ్యాంకు విధానాలు అనుసరిస్త్తోన్న మోడీ ప్రభుత్వం
– రైతన్నను కాపాడేందుకు చర్యలు శూన్యం
– ఆయనకు ఏమైనా జరిగితే బీజేపీనే బాధ్యత వహించాలి : సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
రైతులు పండించిన పంటలకు చట్టబద్దమైన గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ సరిహద్దులోని ఖనేరీలో 46 రోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జత్ సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా శుక్రవారం ఖమ్మంలోని సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్ నుంచి సరితా క్లీనిక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రపంచ బ్యాంకు విధానాలు, కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఫలితంగా భారత్ దేశం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందటం లేదని విమర్శించారు. అంబానీ, అదానీ కోసం బడా ప్రపంచ పారిశ్రామికవేత్తల కోసం మోడీ 24 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడటానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈ దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకొనే విధంగా మోడీ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. దేశంలో ఉన్న రైతులు బాగుపడాలని నిరవధిక దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జత్ సింగ్‌కు ఏమైనా జరిగితే మోడీ బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై .విక్రమ్, వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.