నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీఎంతోపాటు మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై వారు చర్చించారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పరస్పరం వారు అభిప్రాయాలు, అంచనాలను నివేదించుకున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్ ఇప్పటికే నామినేషన్ వేసి ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ సీపీఐ(ఎం)కు మద్దతునివ్వడం మంచిదని ఆ పార్టీ సూచించింది. కాంగ్రెస్ అందుకు సిద్ధపడకపోయినా భువనగిరిలో సీపీఐ(ఎం) స్నేహపూర్వక పోటీ చేస్తూనే మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతునిస్తుందని ప్రకటించింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా కాంగ్రెస్‌కు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం తెచ్చింది. ఇటీవల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చిన సమయంలోనూ ఈ విషయాలను చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా కూటమి భాగస్వాములుగా బీజేపీని ఓడించడం కోసం భువనగిరిలో సీపీఐ(ఎం) నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలనీ, కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలంటూ సీపీఐ(ఎం) ప్రతినిధి బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్టు తెలిసింది. దీనిపై సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం తమ అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తూనే సీఎం ప్రతిపాదనను పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. ఆదివారం సాయంత్రానికి తుదినిర్ణయం వెలువడే అవకాశమున్నట్టు తెలిసింది.
భువనగిరిలో పోటీ.. మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు : తమ్మినేని
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు సీపీఐ(ఎం) ప్రతినిధి వర్గం చర్చించడానికి వెళ్లిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించామన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పోటీ చేస్తున్నదని వివరించారు. అక్కడ పోటీ నుంచి సీపీఐ(ఎం) విరమించుకోవాలనీ, కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మిగతా 16 సీట్లలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. భువనగిరిలో సీపీఐ(ఎం)కు కాంగ్రెస్ మద్దతివ్వాలని కోరారు. బీజేపీ, ఇతర శక్తులు గెలవకుండా ఉండాలంటే సీపీఐ(ఎం) పోటీ నుంచి మిరమించుకుని కాంగ్రెస్‌కు మద్దతివ్వాలనీ, అందుకు సీఎం కొన్ని ప్రతిపాదనలు పెట్టారని చెప్పారు. వాటిపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. తమ నిర్ణయంలో మార్పు జరగాలంటే సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలో చర్చించాల్సి ఉంటుందన్నారు. ఆ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని అన్నారు. మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు.
సీపీఐ(ఎం) సహకారంతో ముందుకెళ్తాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సీపీఐ(ఎం) నాయకులతో చర్చలు జరిపామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంతోపాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలను వారి ముందు పెట్టామని వివరించారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారని చెప్పారు. దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేస్తామన్నారు. ఒకట్రెండు విషయాల్లో సందిగ్ధత ఉన్నా అధిష్టానంతో చర్చించి ఆదివారంలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారని అన్నారు. సీపీఐ(ఎం) సహకారంతో భవిష్యత్‌లో ముందుకెళ్తామని చెప్పారు. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందన్నారు.