ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం) కార్యదర్శి ఎండి.జహంగీర్

నవతెలంగాణ -వలిగొండ రూరల్
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రలోభాల పట్ల ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలు పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా జాగ్రత్త వహించాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, సిపి(ఐ)ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్యలు  విజ్ఞప్తి చేశారు. సోమవారం పులిగిల్ల గ్రామంలో జరిగిన సీపీఐ(ఎం) గ్రామ శాఖ ముఖ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, పార్టీలు ఎన్నికలలో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రజలను అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నారని గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు వీరి ప్రలోభాల పట్ల అప్రమత్తంగా ఉండి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు ఇలాంటి ప్రలోభాలకు గురిచేసే రాజకీయ పార్టీలను తిరస్కరించాలని కోరారు. ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు మద్యాన్ని ఎరగా చూపి ఓట్లు దండుకొని గెలిచిన తర్వాత ప్రజలను కనీసం పట్టించుకున్న పాపాన వారు పోరని ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకొని ప్రలోభాలకు గురిచేస్తున్న రాజకీయ పార్టీలను ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కొమ్మిడి లక్ష్మారెడ్డి, శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి, సహాయ కార్యదర్శి మారబోయిన నరసింహ, మాజీ ఎంపీటీసీ బుగ్గ ఐలయ్య, నాయకులు దొడ్డి బిక్షపతి, వరికుప్పల యాదయ్య, శంకరయ్య, వేముల అమరేందర్, బొడ్డు రాములు, మారబోయిన ముత్యాలు, వరికుప్పల నరసింహ, వేముల జ్యోతి బాబు, బుగ్గ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love