– పేదల పక్షాన అలుపెరగని పోరాటాలు
– పలు రాజకీయ పార్టీల నేతల నివాళి
నవతెలంగాణ-కొత్తగూడెం
పేదల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన ఉద్యమ కెరటం, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని అయిలయ్య(75) మృతిచెందారు. కొత్తగూ డెం ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుం టున్న సందర్భంలో ఒక్కసారిగా బీపీ తగ్గి, గుండెపోటు రావడంతో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచా రు. అనంతరం ఆయన నివాసం సుజాతనగర్ మం డల కేంద్రానికి తరలించారు. ఆదివారం ఉదయం అంతక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు కుమారుడు లెనిన్, కుమార్తె జ్యోతి ఉన్నారు. ఇద్దరికి ఆదర్శ వివాహాలు చేశారు. భార్య కాసాని లక్ష్మీ 2017లో సుజాతనగర్ సర్పంచ్‌గా సేవలందిస్తూ అకాల మరణంచెందారు. కాసాని మృతి పట్ల పలువురు రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు తీవ్ర సంతాపం సానుభూతి తెలిపా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
నేడు అంత్యక్రియలు
ఆదివారం ఉదయం 10 గంటలకు సుజాతనగర్ మండల కేంద్రంలో సంతాప సభ అనంతరం అంత్యక్రియలు జరుగుతాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. అంత్యక్రియలో అన్ని వర్గాల ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
కాసాని ప్రజా పోరాట నాయకులు : మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు, సుజాతనగర్, కొత్తగూడెం ప్రాంతాల ప్రజల పక్షాన నాలుగున్నర దశాబ్దాల పాటు కాసాని ఐలయ్య తను నమ్మిన సిద్ధాంతం కోసం దీక్ష, పట్టుదలతో నిలబడ్డారు. రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చినా, ఇబ్బందులు తలెత్తినా ఎర్రజెండా పక్కన నిలబడిన నాయకులు ఐలయ్య. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తుదిశ్వాస వరకు ప్రజల మధ్యనే జీవించారు. ప్రజా ఉద్యమాన్ని కాపాడటమే ఆయనకు ఇచ్చే నివాళి.