సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు నర్సింగరావు మృతి

–  పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి. జ్యోతి నివాళి
నవతెలంగాణ-బేగంపేట్‌
సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు కామ్రేడ్‌ నర్సింగరావు అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. జ్యోతి, గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, నాయకులు కేవీవీఎస్‌ఎన్‌ రాజు, ఎన్‌ సోమయ్య.. హైదరాబాద్‌ బోయగూడలోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి, ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. నర్సింగరావు కమ్యూనిస్టు సిద్ధాంతా లకు ఆకర్షితులై చిన్నతనం నుంచి పేదల కోసం నిరంతరం పోరాటాలు చేశారని తెలిపారు. సుమారు 1955 నుంచి అప్పటి ఉమ్మడి సీపీఐ, ఆనంతరం సీపీఐ(ఎం) సభ్యుడిగా కొనసాగిన ఆయన.. బోయగూడలో అనేక ప్రజా సమస్యలపైన పోరాటాలు నిర్వహించారని, ఆ ప్రాంత పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ ప్రజాసంఘాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు. బోయగూడలోని ప్రాగా టూల్స్‌లో కార్మికుల హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు. ఇల్లు లేని పేదలకు అండగా నిలిచి ఇండ్ల నిర్మాణానికి పోరాటాలు నిర్వహించారన్నారు. బోయగూడలో బలమైనటువంటి ప్రజా పునాదిని నిర్మించి అంచలంచెలుగా ఎదుగుతూ 1965లో బోయగూడ కార్పొరేటర్‌ స్థానానికి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారని తెలిపారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి చివరి క్షణం వరకు పార్టీ ఆశయాల కోసమే కట్టుబడి పని చేసినటువంటి గొప్ప నాయకులు కామ్రేడ్‌ నర్సింగ్‌ రావు అని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీవ్ర నష్టమని తెలిపారు. నివాళి అర్పించిన వారిలో.. నగర కమిటీ సభ్యులు జి.నరేష్‌, సనత్‌నగర్‌ నాయకులు పి.మల్లేష్‌, రమేష్‌, మహేందర్‌, కా.నర్సింగ్‌ రావు తదితరులు ఉన్నారు.

Spread the love