నవతెలంగాణ-హైదరాబాద్ : వృత్తి కులాలకు ఆర్థిక సహాయ పథకం దరఖాస్తు గడువు పెంపు గురించి బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్‌కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. బీసీ కులాలవారికి వృత్తుల ఆధునీకరణ, పనిముట్లు, ముడిసరుకుల కొనుగోలు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. ఈమేరకు జూన్ 6వ తేదీన జీఓ నెం.5 విడుదల చేసి జూన్ 20వ తేదీ లోపు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వృత్తికులాలకు చెందిన లక్షలాదిమంది ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు సమయంలో కులం, ఆదాయం, నివాస ధృవపత్రం, ఆధార్, రేషన్‌కార్డులు జతపరచవల్సి ఉంది. ఆదాయ పత్రాలకోసం దరఖాస్తు చేసుకుని పేదలు మండల కేంద్రాలలో రోజుల తరబడి పడిగాపులు పడుతున్న పరిస్థితి కనపడుతున్నది. మీ సేవా కేంద్రాల్లో జనం క్యూ కడుతున్నారు. సర్టిఫికేట్స్ జారీ చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటితో పాటు వెబ్సైట్ ఓపెన్ కావడానికి సమయం పడుతున్నది. కొన్ని సందర్భాలలో సర్వర్‌డౌన్ అవుతుండటం వంటి సాంకేతిక సమస్యలు ఎదురౌతున్నాయి. అలాగే అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వకపోవడం సమస్యగా వున్నది. వృత్తిదారులు అనేకమంది నిరక్షరాస్యులు, అత్యంత వెనకబడినవారు. దరఖాస్తు చేసుకోవడానికి సమయం చాలా తక్కువ ఉండటం, ధృవపత్రాలకోసం దరఖాస్తు చేసుకున్నా అవి సకాలంలో రాకపోవడంతో తాము ఆర్థిక సాయం పొందలేమనే తీవ్ర ఆందోళనతో ఉన్నారు. పై సమస్యల దృష్ట్యా ఆన్లైన్ దరఖాస్తు గడువును జూన్ ఆఖరివరకూ పొడిగించి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకునేందుకు తోడ్పడాలని, అర్హులైనవారందరికీ ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాను అని తమ్మినేని లేఖలో తెలిపారు.